ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విషాదం చోటు చేసుకుంది. బాత్రూమ్‌లోని కిటికీకి ఉరివేసుకొని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఒంగోలు ట్రిపుల్ ఐటీలో పీయూసీ 2 చదువుతున్న నరసింహనాయుడుగా గుర్తించారు. ఇతను శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేటకు చెందిన వాడు. మృతుని తండ్రి చనిపోవడం, ఆర్థిక సమస్యల వంటి వ్యక్తిగత కారణాల వల్లే విద్యార్థి నరసింహనాయుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తోటి విద్యార్థుల సమాచారంతో అక్కడకు చేరుకున్న డైరెక్టర్ కుమారస్వామి గుప్తా విద్యార్థి తల్లికి సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా విద్యార్థి ఆత్మహత్యతో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ మరోసారి వార్తల్లో నిలిచింది.