AP: ఏపీ శాసనమండలిలో దుమారం

మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలపై వాదోపవాదాలు... రికార్డుల నుంచి తొలగించిన ఛైర్మన్;

Update: 2024-11-22 03:00 GMT

ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెడికల్‌ కళాశాలల నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ శాసన మండలిలో విమర్శించారు. కేంద్రం ఇచ్చిన రూ.198 కోట్లను దారి మళ్లించిందన్నారు. వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.8,400 కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉండగా రూ.1,400 కోట్లే ఖర్చు చేసిందన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్‌ యాదవ్‌ చెప్పిన సామెత సభలో దుమారం రేపింది. ఇది ఓ మతం వారిని కించపరిచేలా ఉందని.. మంత్రి క్షమాపణలు చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్‌ చేశారు. మంత్రి సత్యకుమార్‌ మాట్లాడుతూ ‘తన సామెత ఏ కులాన్నీ, ఏ మతాన్నీ అవమానించేలా, మనోభావాలను దెబ్బతీసేదిగా లేదని, ఒకవేళ ఉన్నట్లు భావిస్తే.. వెనక్కి తీసుకుంటున్నాను’ అన్నారు. చైర్మన్‌ మోషేన్‌రాజు ‘ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలి’ అని ఆదేశించారు.

తీవ్ర వాదోపవాదాలు..

మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. మంత్రి వ్యాఖ్యలపై సభ విచారం వ్యక్తం చేస్తున్నట్లు మండలి ఛైర్మన్‌ కె మోషేను రాజు ప్రకటించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వైద్య విద్య సీట్లను వద్దంటూ జాతీయ వైద్య మండలికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసిన అంశంపై వైసీపీ సభ్యులు వరాహ వెంకట సూర్యనారాయణరాజు, అరుణ్‌కుమార్‌ శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రిని అడిగారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘100 ఎలుకలు తిన్న పిల్లి పాపపు పరిహారం కోసం హజ్‌ యాత్రకు వెళ్లినట్లు విధ్వంసం సృష్టించిన వైసీపీ నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై వైసిపి సభ్యులు మహ్మద్‌ రుహుల్లా మిగిలిన సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక మతాన్ని కించపరిచే విధంగా మంత్రి వ్యాఖ్యలు సరికావని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తాను సామెత చెప్పానని ‘హజ్‌ యాత్ర’, ‘కాశీ యాత్ర’ అభ్యంతకరమైతే తన మాటలను వెనక్కి తీసుకుంటానని మంత్రి అన్నారు.

పోడియం చుట్టుముట్టిన వైసీపీ

వైసీపీ సభ్యులు ఛైర్మన్‌ పొడియం ముందు ఆందోళన చేశారు. మంత్రి క్షమాపణ చెప్పాలని, అతను మాటలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు…. మంత్రి సత్యకుమార్‌ వ్యాఖ్యలను సమర్ధిస్తూ హజ్‌ యాత్ర విలువను పెంచారని అన్నారు. డిప్యూటీ ఛైర్మన్‌ మనయా జకియా ఖానమ్‌ మాట్లాడుతూ.. గౌరవప్రదమైన సభలో మతాన్ని, కులాన్ని కించపరిచేలా మాట్లాడకూడదని అన్నారు. మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌ మాట్లాడుతూ.. సభ రికార్డులను పరిశీలించి అభ్యంతరకమైన వ్యాఖ్యలుంటే తొలగించాలని చెప్పారు. మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ మండలి సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి తన బాధ్యతను విస్మరించి మతాలు, వ్యక్తులను ధూషిస్తూ మాట్లాడటం సమంజసం కాదని మంత్రి సత్యకుమార్‌నుద్దేశించి అన్నారు. అభ్యంతరకరమైన పదాలుంటే సభ్యులు బాధపడ్డ విషయంపై సభ విచారం వ్యక్తం చేస్తుందని, అటువంటి పదాలను రికార్డుల నుంచి తొలగించాలని ఛైర్మన్‌ పేర్కొన్నారు.

Tags:    

Similar News