CBN: టీడీపీ ఎమ్మెల్యేపై చంద్రబాబు సీరియస్
టీడీపీ భేటీకి 15 మంది ఎమ్మేల్యేల డుమ్మా... పార్టీ పనుల కంటే మీ పనులు ఎక్కువా..... ప్రజల్లోకి వెళ్లేందుకు నామోషీ ఎందుకు..? చంద్రబాబు సూటి ప్రశ్నలు;
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయిన సందర్భంగా ప్రజాప్రతినిధులను ఇంటింటికీ వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు వెళ్లి ఏడాదిలో అమలు చేసిన పథకాలు వివరించాలని సూచించారు. దీనిపై టీడీపీ నేతలకు ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం నిర్వహించారు. అందు కోసం టీడీపీ ప్రజాప్రతినిధులతో వర్క్‌షాప్ చేపట్టారు. ఇందులో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి గైర్హాజరైన 15మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉండటంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నియోజకవర్గాల్లో ప్రజలకు దూరంగా ఉండటం సరికాదని గట్టిగా హెచ్చరించారు. ఆహ్వానితుల్లో 56మంది గైర్హాజరయ్యారని సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఉదయం ఎంత మంది వచ్చారు, సంతకాలు పెట్టి ఎంత మంది వెళ్లిపోయారు, సమావేశం చివరి వరకూ ఎంత మంది ఉన్నారో అందరి లెక్కలు తన వద్ద ఉన్నాయని చంద్రబాబు అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా గత ఎన్నికల్లో పార్టీలో మార్పులు చేశామని చంద్రబాబు అన్నారు. సోషల్ ఇంజినీరింగ్ చేసి అందరికీ సమాన అవకాశాలు ఇచ్చామని గుర్తు చేశారు. అందుకే ఈసారి ఎక్కువ మంది కొత్తవాళ్లు ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారని గుర్తు చేశారు. వారు మళ్లీ మళ్లీ గెలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అలా మళ్లీ మళ్లీ గెలిచేందుకు ఇప్పుడు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ తెచ్చుకునేలా ప్రయత్నించాలని దిశా నిర్దేశం చేశారు. ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాలకంటే ఇతరత్రా ఎక్కువయ్యాయా అని నిలదీశారు.
నిత్యం ప్రజల్లో ఉండాలి..
ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉండాలని చంద్రబాబు సూచించారు. ఎవరు ఎలా పని చేస్తున్నారో గతం కంటే ఈసారి క్లియర్ కట్‌గా సమాచారం వస్తోందని తెలిపారు. ఆ రిపోర్టులను ఎమ్మెల్యే చేసిన తప్పులు మంచి పనులు తన వద్ద ఉన్నాయని వివరించారు. వాటిని ఆధారంగా ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నానని వివరించారు. శనివారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించినట్టు చంద్రబాబు ప్రకటించారు. నలుగురితో మొదలు పెట్టానని కచ్చితంగా రోజుకు నలుగురితో మాట్లాడతానని టీడీపీ అధినేత వెల్లడించారు. అన్నీ పూర్తి చేశామని చెప్పడం లేదని కానీ ప్రజలకు అవసరమైనవి అమలు చేశామని తెలిపారు. ఇంకా అమలు చేయాల్సిన ఉన్నాయని వాటిని ఎందుకు అమలు చేయలేకపోతున్నామో ప్రజలకు వివరించాలని తెలిపారు. అందుకే సుపరిపాలనలో తొలి అడుగు అనే కాన్సెప్టు తీసుకొచ్చామని వెల్లడించారు. నాలుగేళ్లు రాజకీయాలు మర్చిపోయి రాష్ట్రం కోసం కష్టపడి ఆఖరి ఏడాది ఎన్నికల గురించి ఆలోచిస్తే మంచి ఫలితాలు రావని చంద్రబాబు అన్నారు .