అక్రమ మైనింగ్‌ జరగకపోతే ఎందుకు అడ్డుకున్నారు-చంద్రబాబు

Chandrababu: దేవినేని కుటుంబ సభ్యులను పరామర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు

Update: 2021-07-31 06:30 GMT

Chandrababu file Photo 

Chandrababu: దేవినేనిని అరెస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. కొండపల్లి బొమ్మలను తయారుచేసే చెట్లను నరికేస్తూ, కొండపల్లి అడవుల్లో ఇష్టానుసారం అక్రమ మైనింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ మైనింగ్‌ను అడ్డుకోమని చెబితే స్పందిచకపోగా తిరిగి దేవినేనిపైనే కేసు పెట్టారని అన్నారు. ఎస్సీలపై దాడి చేశారంటూ దేవినేనిపై తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 గంటల పాటు దేవినేని కారులోనే ఉన్నప్పటికీ.. దాడి చేశారని, అలజడి సృష్టించారని కేసు పెట్టడం దారుణమని అన్నారు.

టీడీపీ శ్రేణులపై దాడి చేసిన వైసీపీ నేతలపై కేసు పెట్టేందుకు వెళ్తే.. కనీసం పోలీస్‌ స్టేషన్‌లోకి కూడా అనుమతించలేదన్నారు చంద్రబాబు. దేవినేని ఎపిసోడ్‌ సంఘటనను రాష్ట్రం మొత్తం చూస్తోందని అన్నారు. వైసీపీ వాళ్లు బెదిరిస్తే భయపడి పారిపోవాలా అంటూ మండిపడ్డారు. ఇలాంటి ముఖ్యమంత్రులను చాలామందిని చూశామని అన్నారు.


దేవినేని ఉమ కుటుంబ సభ్యులను పరామర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. గొల్లపూడిలోని దేవినేని ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. ఉమ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. చంద్రబాబు రాకతో గొల్లపూడిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబు వస్తుండడంతో టీడీపీ శ్రేణులు కూడా భారీగా చేరుకున్నాయి. దీంతో దేవినేని ఉమ ఇంటి వద్ద పోలీసు బలగాలను భారీగా మోహరించారు. కొండపల్లిలో అక్రమ మైనింగ్‌ జరుగుతోందంటూ ఆరోపించిన దేవినేని.. అక్కడి మైనింగ్ కార్యకలాపాలను పరిశీలించి వస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దేవినేనిని రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు.

దేవినేని కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ దళిత నాయకులు ప్రయత్నించాయి. గొల్లపూడి పంచాయతీ కార్యాలయం వద్ద భారీగా చేరుకున్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు కొండపల్లిలో నిజనిర్ధారణకు వెళ్తున్న టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు పోలీసులు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబును హౌస్‌ అరెస్ట్ చేశారు. దీంతో ఆనందబాబు ఇంటి వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కమిటీ సభ్యులు తంగిరాల సౌమ్య, నాగుల్ మీరాలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

విజయవాడలో వర్ల రామయ్య, బోండా ఉమా, మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర , కొనకళ్ల నారయణ, జగ్గయ్యపేటలో నెట్టెం రఘురాంలను నిన్ననే ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. వ్యక్తిగత పనుల మీద బయటకు వెళ్లే తమను ఎలా అడ్డుకుంటారని నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్రలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరును నేతలు తీవ్రంగా ఖండించారు.  

Tags:    

Similar News