CBN: వైసీపీ పాలనలో దళితుల దగా
కులాల మధ్య వైసీపీ చిచ్చు పెడుతోందన్న చంద్రబాబు... అమలాపురం సభలో జగన్ పాలనపై విమర్శనాస్త్రాలు;
వైసీపీ పాలనలో దళితులు దగాకు గురయ్యారని . తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.ఎస్సీలకు చెందిన 27 పథకాలు రద్దు చేశారన్న ఆయన ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గపు చర్యలను చూశామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్సీలు, బీసీలకు కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీల్లో మిగతా వారికి అన్యాయం జరగకుండా వర్గీకరణకు కూడా కృషిచేస్తామని పి.గన్నవరం సభలోచెప్పారు. ప్రశాంతతకు మారుపేరు అయిన కోనసీమలో వైసీపీ చిచ్చు పెట్టిందన్న పవన్ శాంతిభద్రతలను కాపాడతామని భరోసా ఇచ్చారు. ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో జరిగిన సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్‌తోపాటు మొత్తం 11 హామీలను సమర్ధంగా అమలుచేస్తామని ఇరువురు నేతలు హామీఇచ్చారు. ఇదే సమయంలో జగన్ సర్కారుపై నిప్పులు చెరిగిన చంద్రబాబు గత ఐదేళ్లలో ఏ ఒక్క వర్గానికీ న్యాయం చేయలేదని ధ్వజమెత్తారు.
వైసీపీ దళిత ద్రోహి అని మండిపడిన చంద్రబాబు అనేక మందిపై దాడులు చేయడం సహా పెద్ద సంఖ్యలో హత్యలు కూడా చేశారని తెలిపారు. వైసీపీ బారి నుంచి ఐదు కోట్ల మంది ప్రజలను కాపాడేందుకు కలిసి పనిచేస్తున్నామని చెప్పిన పవన్ .కూటమికి ఎందుకు ఓటు వేయాలో వివరించారు. చట్టబద్ధంగా కులగణన చేస్తామన్న నేతలు బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామని, స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తామని హామీఇచ్చారు. సీఎం జగన్ కోనసీమను మరో పులివెందుల చేయాలనుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. మూడు జెండాలు వేరయినా.. అజెండా మాత్రం ఒక్కటేనన్నారు. కోనసీమను బంగారు సీమగా మారుస్తామని పునరుద్ఘాటించారు. అమలాపురంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టి వైసీపీ చలికాచుకుంటోందని విమర్శించారు. ఐదేళ్లలో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని, జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు.
కొండంత ప్రచారంతో జగన్నాటకాలు ఆడుతోంది. జగన్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపారు. రాష్ట్రంలో సహజ వనరులు అన్నీ దోచేశారు. ప్రజల ఆస్తులపై జగన్ ఫొటో వేసుకుంటున్నారు. భూ పరిరక్షణ చట్టం పేరుతో ప్రజలను మోసగిస్తున్నారు. ప్రజల భూమి తాకట్టు పెట్టి ఇతరులకు బదిలీ చేసే ప్రమాదముంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం పడకేసింది. బటన్ నొక్కి బొక్కింది ఎంత? మీవాళ్లు దోచింది ఎంత?’’ అని చంద్రబాబు నిలదీశారు.