MEET: వైసీపీ తెగులుకు టీడీపీ-జనసేన వ్యాక్సిన్
సుస్థిర ప్రభుత్వం ఇవ్వాలన్నదే లక్ష్యమన్న పవన్... సమన్వయ కమిటీలో సుదీర్ఘ చర్చ;
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వాలనే దానిపైనే తెలుగుదేశం, జనసేన సమన్వయ కమిటీలో చర్చించామని పవన్ కల్యాణ్, లోకేశ్ స్పష్టం చేశారు. రెండు పార్టీలు కలిసి ఎలా పనిచేయాలనే అంశంపై చర్చించామని రాజమండ్రిలో ఇరుపార్టీల సమావేశం తర్వాత వెల్లడించారు. నవంబర్ 1న ఉమ్మడి మేనిఫెస్టో సహా..ఐక్య కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. రాజమండ్రిలోజరిగిన జనసేన-తెలుగుదేశం తొలి సమన్వయ కమిటీ సమావేశంలో ఇరుపార్టీల నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో ఉమ్మడి కార్యచరణతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు.
అంతకుముందు సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ తరపున ప్రస్తావించాల్సిన అంశాలపై ములాఖత్ సందర్భంగా చంద్రబాబుతో లోకేశ్ చర్చించారు. నిత్యావసర ధరలు, విద్యుత్‌ఛార్జీల మోత వంటి అంశాలపైనా దృష్టిసారించాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం.క్షేత్రస్థాయి వరకు తెలుగుదేశం-జనసేన కమిటీల ఏర్పాటుపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం మంజీర హోటల్‌లో ఇరుపార్టీల నేతలు సమావేశమయ్యారు. ఏపీ ప్రజలకు సుస్థిరమైన ప్రభుత్వం ఇవ్వాలనే దానిపైనే చర్చ జరిగిందని పవన్‌కల్యాణ్ వెల్లడించారు. వైసీపీ పాలనలో ప్రతి ఒక్కరూ సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో చంద్రబాబును అక్రమంగా జైలులో పెట్టారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో దారుణాలు, హత్యలు చేసిన వారికి బెయిల్ వస్తుంది కానీ చంద్రబాబుకు టెక్నికల్ కారణాలు చూపి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
రాబోయే వంద రోజుల కార్యచరణపై చర్చించామని లోకేశ్ తెలిపారు. ఈ నెల 29, 30, 31న ఉమ్మడి జిల్లాల్లో ఇరుపార్టీల నేతలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. రైతు సమస్యలపై ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించామన్నారు. వచ్చే ఎన్నికల కోసం నవంబరు 1న ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటించి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తామని లోకేశ్ వివరించారు. వందరోజుల కార్యాచరణ ప్రకటించామని, నవంబర్ 1 నుంచి మ్యానిఫెస్టో ప్రకటించి ప్రచారం ప్రారంభిస్తామని, ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తామని లోకేశ్ తెలిపారు. ఈ సమావేశంలో మూడు తీర్మానాలు చేశామని, చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఒక తీర్మానం, అరాచక వైసీపీ పాలన ఉంచి ప్రజలను రక్షించాలని మరొకటి, రాష్ట్రాభివృద్ధి కోసమే కలిసి పోరాటం చేయాలని మూడో తీర్మానం చేశామని లోకేశ్ అన్నారు. సమన్వయ కమిటీ భేటీకి ముందు లోకేశ్, పవన్‌కల్యాణ్ దాదాపు అరగంటపాటు విడిగా సమావేశమయ్యారు. జిల్లాల వారీగా ఇరుపార్టీల నేతలఆత్మీయ సమావేశాలపై చర్చించారు. సమన్వయ కమిటీ తదుపరి భేటీలు.. ఉత్తరాంధ్ర, రాయలసీమలో జరపాలని నిర్ణయం తీసుకున్నారు.