AP PROTESTS: ఊరూరా "కాంతితో క్రాంతి"
పెద్దఎత్తున పాల్గొన్న ప్రజలు... బాబుతోనే మేమంటూ నినాదాలు;
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన ‘కాంతితో క్రాంతి’ కార్యక్రమానికి ఊరూ, వాడా కదలింది. తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు తెలుగురాష్ట్ట్రాల్లో 'కాంతితో క్రాంతి' కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. కొవ్వొత్తులతో కాంతులు నింపారు. కాగడాలు చేతపట్టి గర్జించారు. శనివారం రాత్రి 7 గంటల నుంచి 7గంటల 5నిమిషాల మధ్య విద్యుద్దీపాలు ఆపి, ఇళ్ల నుంచి బయటకొచ్చి దీపాలు వెలిగించారు. ఇళ్లలో లైట్లు ఆఫ్ చేసి మొబైల్ టార్చ్, దీపాలు, కొవ్వొత్తులు వెలిగించారు. ఇళ్ల బయట,వాకిళ్లు, వీధుల్లో దీపాలు వెలిగించారు. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, ప్రజలు రోడ్లపై వాహనాల లైట్లు బ్లింక్ చేసి అభిమాన నేతకు సంఘీభావం తెలిపారు. కాంతితో క్రాంతి’ హ్యాష్ ట్యాగ్‌కు వేలాదిమంది నెటిజన్ల నుంచి మద్దతు లభించడంతో.. ఎక్స్(ట్విట్టర్)లో దేశస్థాయిలో ట్రెండింగ్‌లో నిలిచింది..
రాజమండ్రిలో నారా భువనేశ్వరి, దిల్లీలో లోకేష్ దీపాలు వెలిగించారు. తెలుగు యువత ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో ప్రమిదలు వెలిగించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం ముఖ్య నేతలు కాగడాలను చేతపట్టి..నిరసనలో పాల్గొన్నారు. నారా బ్రాహ్మణి హైదరాబాద్‌లో దీపాలు వెలిగించి నిరసన తెలియ జేశారు. రాజధాని గ్రామాల్లో మహిళలు కొవ్వొత్తులు వెలిగించి చంద్రబాబుకు మద్దతు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో సరిగ్గా ఏడు గంటల 7 నిమిషాలకు..... క్రాంతితో క్రాంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి కాంతితో క్రాంతి కార్యక్రమం నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో.. లైట్లు, వీధి లైట్లు ఆర్పి కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు. పొదిలి, కొనకనమిట్ల, తర్లుపాడు మండలాల్లోనూ సంఘీభావం తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కాగడాలు పట్టుకుని చీకటి ప్రభుత్వాన్ని పారదోలుదామని నినాదాలు చేశారు. ఆమదాలవలసలో కొవ్వొత్తులు, టార్చిలైట్ల వెలుగుతో.. క్రాంతితో కాంతి నిర్వహించారు.
హైదరాబాద్ మణికొండ చౌరస్తా నుంచి ల్యాంకోహిల్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. సనత్ నగర్ డివిజన్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. భద్రాచలంలో తెలుగుదేశం చేపట్టిన కొవ్వొత్తుల నిరసనలో.... భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లోను కాంతితో క్రాంతి నిర్వహించారు. బెంగళూరులోను దీపాలు వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. మియాపూర్‌లోని లోని మయూరినగర్‌లో ర్ మహిళలు, చిన్నారులు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేశారు. దీప్తిశ్రీనగర్ లో ఆ పార్టీ శ్రేణులు కాగడాల ప్రదర్శన చేశారు. బాబుతోనే మేము అంటూ ప్లకార్డులు చేతబూని.. సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మణికొండ మర్రిచెట్టు జంక్షన్ నుంచి ల్యాంకోహిల్స్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.