LOKESH: రాయలసీమ రత్నాల సీమ చేసేది మేమే

జగన్‌ పాలనలో అభివృద్ధి జాడే లేదన్న నారా లోకేశ్‌... శంఖారావం సభల్లో వైసీపీపై తీవ్ర విమర్శలు

Update: 2024-03-11 01:00 GMT

రాయలసీమ మళ్లీ రత్నాల సీమగా మారాలంటే అది తెలుగుదేశంతోనే సాధ్యమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. టీడీపీ హయాంలో పెద్దఎత్తున తాగు, సాగు నీటి పనులు జరిగితే జగన్‌ పాలనలో పడకేశాయని మండిపడ్డారు. ఉరవకొండ, రాయదుర్గం, కల్యాణదుర్గంలో జరిగిన శంఖారావం సభల్లో పాల్గొన్న లోకేష్‌ వైకాపాను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలుగుదేశం హయాంలో అనంతపురం జిల్లా అభివృద్ధిలో పరుగులు పెడితే..జగన్‌ పాలనలో మళ్లీ కరవు బాట పట్టిందని లోకేష్‌ విమర్శించారు. ఉరవకొండలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. ఏ నియోజకవర్గంలో లేనంతగా పయ్యావుల కేశవ్ ఉరవకొండను అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసిన లోకేశ్ అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తామన్నారు. చేనేతలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.


ఉరవకొండ సభ అనంతరం రాయదుర్గంలో జరిగిన శంఖారావం సభలో లోకేష్‌ పాల్గొన్నారు. టీడీపీ హయాంలో ఏ నియోజకవర్గానికి రానన్ని నిధులు రాయదుర్గానికి కాలువ శ్రీనివాస్‌ తెచ్చారని లోకేష్‌ చెప్పారు. రోడ్లు, భవనాల నిర్మాణంతో పాటు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. వైకాపా పాలనలో అన్ని వర్గాల వారికి తీరని నష్టం జరిగిందని.. రాష్ట్రాన్ని దివాలా దిశగా తీసుకువెళ్లారని మండిపడ్డారు. కల్యాణదుర్గంలో జరిగిన శంఖారావం సభలో లోకేష్‌..వైసీపీ అరాచకాలపై ధ్వజమెత్తారు. చట్టాలు ఉల్లంఘించిన అధికారుల పేర్లు రెడ్‌బుక్‌లో ఉన్నాయని కూటమి ప్రభుత్వం వచ్చాక వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

‘‘ఉరవకొండలో 3 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఉరవకొండకు పయ్యావుల కేశవ్‌ మెగా డ్రిప్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు సాధించారు. జగన్‌ వచ్చాక ఇక్కడ పది శాతం పనులు కూడా జరగలేదు. వైసీపీ నేతలు ఉరవకొండను దోచేస్తున్నారు. నకిలీ ఆధార్‌ కార్డులు, పత్రాలతో భూములు కాజేస్తున్నారు. ఉరవకొండలో 80 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు.. కనీసం 8 ఎకరాలకైనా సాగునీరు ఇచ్చారా? తెదేపా-జనసేన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి. ప్రతి చెరువుకు నీరు, మెగా డ్రిప్‌ ఇరిగేషన్‌ తీసుకువస్తాం. మంగళగిరి మాదిరిగా ఉరవకొండ చేనేతలను ఆదుకుంటాం’’ అని నారా లోకేశ్‌ తెలిపారు.


మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలో సీఎం జగన్ అబద్దాల విషపు జల్లు కురుపించారని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. హామీలు నిలబెట్టుకున్నానంటూ జగన్ మాట పచ్చి అబద్ధమని దుయ్యబట్టారు. 85శాతం హామీలు అమలు చేయకుండా మాట తప్పారని అచ్చెన్న ఆగ్రహం వ్యక్తంచేశారు. సంక్షేమానికి బడ్జెట్ లో జగన్ 15శాతం ఖర్చు చేయగా చంద్రబాబు 19శాతం ఖర్చు చేశారని గుర్తుచేశారు. బాబాయి గొడ్డలివేటు పాపంతో పులివెందులలో ఎలా గెలుస్తావో చూసుకో అని అచ్చెన్నాయుడు సవాలు చేశారు. జగన్ కల 10 లక్షల కోట్ల దోపిడీ, జిల్లాకొక సొంత ప్యాలెస్ నిర్మాణమని ఆక్షేపించారు. మద్య నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న జగన్, మాట తప్పి మడమతిప్పారని అచ్చెన్నాయుడు ఆక్షేపించారు. ఇప్పుడు ఓటు అడిగే హక్కు జగన్ కు ఎక్కడిదని ప్రశ్నించారు. 

Tags:    

Similar News