TDP: నామినేటెడ్ పోస్టుల భర్తీలో లోకేశ్ ముద్ర

పార్టీ కోసం అంకిత భావంతో పని చేసిన వారికే పట్టం.. కూటమి పార్టీ కార్యకర్తల్లో సంతృప్తి;

Update: 2024-09-30 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 కీలక కార్పొరేషన్లకు ఛైర్మన్‌లతో పాటు ఆర్టీసీకి వైస్‌ఛైర్మన్‌ను కూడా నియమించింది. వీటిలో ఏడు కార్పొరేషన్లలో 64 మంది సభ్యులకు చోటు కల్పించింది. మిగతా 13 కార్పొరేషన్లకు ప్రస్తుతానికి ఛైర్మన్లను మాత్రమే ప్రకటించింది. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల పంపకానికి అనుసరించిన సూత్రాన్నే, ఈ పోస్టుల భర్తీలోనూ వర్తింపజేసింది. టీడీపీ నుంచి 16 మందిని ఛైర్మన్లుగా, 53 మందిని సభ్యులుగా, జనసేన నుంచి ముగ్గురిని ఛైర్మన్లుగా, తొమ్మిది మందిని సభ్యులుగా, బీజేపీ నుంచి ఒకరిని ఛైర్మన్‌గా, ఐదుగురిని సభ్యులుగా నియమించారు. ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌ పోస్టు టీడీపీకు దక్కింది. ఇది తొలి విడత మాత్రమే. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, నియోజకవర్గ స్థాయి వరకు ఇంకా భారీగా నామినేటెడ్‌ పోస్టులు, వివిధ దేవాలయాలకు పాలకమండళ్లను ప్రకటించాల్సి ఉంది.

శ్రేణుల్లో సంతృప్తి

ఏపీలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ... కూటమి పార్టీల శ్రేణులకు సంతృప్తి కలిగించింది. టీడీపీ కార్యకర్తల నుంచి సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఈ పదవుల భర్తీలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ ముద్.. నామినేటెడ్ పోస్టుల భర్తీలో స్పష్టంగా కనిపించింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్‌ ప్రభుత్వ తప్పుడు కేసులు, వేధింపులను ఎదుర్కొని నిలబడి.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నేతలకు నామినేటెడ్‌ పోస్టుల్లో న్యాయం జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భర్తీకి సంబంధించి లోకేశ్‌ బృందం విస్తృతంగా కసరత్తు చేసింది. ప్రతిపక్షంలో ఉండగా కష్టనష్టాలకోర్చి.. ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపిన నేతలు, శ్రేణులకు పదవులు నజరానాగా అందించారు. అధికారంలోకి వచ్చాక కొందరు నాయకుల సిఫారసులతో అనేక మంది నామినేటెడ్‌ పదవుల కోసం ప్రయత్నించారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా పనిచేసినవారికే ప్రాధాన్యమివ్వాలని భావించిన లోకేశ్‌ బృందం కొన్ని మార్గాలను అవలంబించింది. గత ఐదేళ్లలో ఏ నియోజకవర్గంలో ఎవరు ఎలా పనిచేశారు.. ప్రభుత్వ ఒత్తిళ్లను తట్టుకుని పనిచేసిన వారెవరు.. దాడులకు గురైన వారెవరు.. కేసులు ఎదుర్కొంటున్నవారెవరు.. అనేవి పరిగణనలోకి తీసుకుని సమాచారం సేకరించారు. పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి, మీడియా, సొంత నెట్‌వర్క్‌ నుంచి కూడా సమాచారం తెప్పించుకుని.. అన్నీ క్రోడీకరించి.. కష్టకాలంలో నమ్మినబంట్లుగా ఉన్నవారినే అందలం ఎక్కించారు. దీనికి తోడు లోకేశ్‌ తన పాదయాత్ర సందర్భంగా వివిధ నాయకులపై చేసిన పరిశీలన వివరాలు కూడా జత చేశారు.

లోకేశ్ వెంటే...

టీడీపీ గతిని మలుపు తిప్పిన ఈ పాదయాత్రలో జగన్‌ కుయుక్తులను తట్టుకుని తన వెన్నంటి నిలబడిన వారందరినీ లోకేశ్‌ గుర్తుంచుకున్నారు. అలాగే పొత్తులో భాగంగా టికెట్లు త్యాగం చేసి పార్టీ పట్ల వీరవిధేయత కనబరచినవారందరినీ అందలం ఎక్కించారు. నమ్మినవారి కోసం నిలబడ్డారు. కష్ట సమయాల్లోనూ, క్లిష్ట పరిస్థితుల్లోనూ పార్టీ గీత దాటని వారికి సముచిత గౌరవం కల్పించారు. టీడీపీని అంటిపెట్టుకుని అత్యంత విధేయత, అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేసిన వారికి ప్రాధాన్యమిచ్చారు. కొందరు అతి సామాన్యులకు కూడా పదవులు వరించాయంటే పార్టీ పట్ల వారి విధేయతే కారణం.

Tags:    

Similar News