ముగిసిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశాలు.. నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం!
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశాలు ముగిశాయి. కొత్త కమిటీల ఏర్పాటు తరువాత తొలిసారి అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో సమావేశాలు జరిగాయి.;
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశాలు ముగిశాయి. కొత్త కమిటీల ఏర్పాటు తరువాత తొలిసారి అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో సమావేశాలు జరిగాయి. తొలిరోజు కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సమావేశాల్లో నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలపై చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. ముఖ్యంగా దేవాలయాల పై దాడుల విషయంలో సీఎం జగన్ పై ఘటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 125 దేవాలయాల్లో దాడులు జరిగితే, తమపై నిందలు వేసేసి చేతులు దులుపుకుంటారా అని ధ్వజమెత్తారు. పార్టీ నేతలు పోరాడితే కేసులు పెడుతున్నారని వీటికి ఎవరూ భయపడవద్దని భరోసా ఇచ్చారు. సీఎం జగన్, డీజీపీ గౌతం సవాంగ్, హోంమంత్రి సుచరిత ముగ్గురూ క్రైస్తవులేనని, అటువంటి వారు దేవాలయాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల‌్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు.
రాష్ట్ర కమిటీ సమావేశంలో కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెం నాయుడు సభను ఉద్దేశించి ప్రసంగించారు. కమిటీలో పదవి అంటే గుంపులో గోవిందం అనుకోవద్దని ఖరాఖండిగా చెప్పారు. పదవి ఉన్న ప్రతి ఒక్కరు బాధ్యతగా పని చెయ్యాలన్నారు. ప్రతి దానికి అధినేత చంద్రబాబు, తాను మాత్రమే స్పందించాల్సిన అవసరం లేదని.. మీరు కూడా స్పందించాలని హితబోధ చేశారు. మరోవైపు దేవాలయాలపై జరుగుతున్న దాడులపై కేంద్రం ఎందుకు స్పందించదని అచ్చెన్న ప్రశ్నించారు.
చాలా రోజుల తరువాత జరిగిన పార్టీ కార్యక్రమంలో నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో చంద్రబాబు, అచ్చెన్నాయుడు చేసిన దిశానిర్దేశం పార్టీ నేతల్లో నయా జోష్ నింపాయి.