ఏపీలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ముగ్గురు విద్యార్థులను ఓ ఉపాధ్యాయురాలు చెప్పుతో కొట్టారు. స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు హోం వర్క్ చేయకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన టీచర్ చెప్పుతో కొట్టారు. ఈ విషయాన్ని విద్యార్థులు తల్లి దండ్రులకు చెప్పడంతో వెంటనే వారు పాఠశాలకు చేరుకుని టీచర్ ను నిలదీశారు. విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే క్రమశిక్షణ కోల్పోయి ప్రవర్తించడం ఏంటని మండిపడ్డారు. ఆగ్రహంతో ఆమె పై దాడి చేశారు. దీంతో పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వన్ టౌన్ పోలీసులు హుటాహుటిన స్కూల్ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీనిపై ఎంఈవో గోపాల్ నాయక్ స్పందిస్తూ విచారణ జరిపి ఉన్నతాధికారు లకు నివేదిక పంపుతామని వెల్లడించారు.