CONGRESS: తెలంగాణలో కాంగ్రెస్‌కు రెండంకెల సీట్లు!
పోలింగ్ సరళిని బట్టి కాంగ్రెస్ పార్టీ అంచనా... బీజేపీకి-కాంగ్రెస్‌కు మధ్యే పోటీ!;
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సరళిని బట్టి అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలతో డబుల్ డిజిట్ వచ్చే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎక్కువ స్థానాల్లో బీజేపీ నుంచి కాంగ్రెస్ గట్టి పోటీని ఎదుర్కొన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా రామమందిరం, అక్షింతలు తదితర అంశాలు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు భాజపా చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్ దీటుగా అడ్డుకోగలిగినట్లు పీసీసీ భావిస్తోంది. బీజేపీకి ఓట్లు వేస్తే రాజ్యాంగాన్ని సవరించి ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తుందన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి జనంలోకి తీసుకెళ్లడంతో బీజేపీకు అడ్డుకట్ట పడినట్లు అంచనా వేస్తున్నారు.
తెలంగాణ ఏర్పాటైన తరువాత నుంచి ఇంత వరకు జరిగిన ఎన్నికలు ఒకఎత్తు... ఇప్పుడు తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికలు మరొక ఎత్తుగా అధికార కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. బీఆర్‌ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్‌లోకి రావడం, గత ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలు భారీగా జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపణలు చేయడం, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్థం చేసినట్లు విమర్శలు చేయడంతోపాటు... కాంగ్రెస్ ఐదు గ్యారంటీలు అమలుకు శ్రీకారం చుట్టడం లాంటివి కాంగ్రెస్‌కు కలిసొచ్చినట్లు చెప్పొచ్చు. అదేవిధంగా ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టడం, ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు ఇచ్చేట్లు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం లాంటి చర్యలు తీసుకుంది. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో లోపాల కారణంగా కుంగిపోయిందని ఆరోపణలు చేయడం... ఇలా అనేక అంశాల కారణంగా భారాసకు ప్రజల్లో కొంత ఆదరణ తగ్గిందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇదే సమయంలో భాజపా ఉత్తర భారతదేశంతోపాటు తెలంగాణ రాష్ట్రంపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది.
పార్లమెంటు ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు ఉంటాయని భావించిన బీజేపీ ఏకంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతోపాటు సీనియర్ నాయకులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేయడం, రామ మందిరం నిర్మాణం, అక్షింతలు పంపిణీ లాంటివి భాజపాకి ఓటర్లను తెచ్చి పెట్టే అనుకూల అంశాలుగా మారినట్లు కాంగ్రెస్ అంచనా వేసింది. భాజపా రాష్ట్రంలో తిష్ట వేసినట్లయితే రాష్ట్రానికి క్యాన్సర్ సోకినట్లేనని సీఎం తీవ్రంగా స్పందించారు. దీంతో భాజపా ఎత్తుగడలను ఎదుర్కొనేందుకు దీటైన రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకత్వం ప్రచారం నిర్వహించింది. ప్రధానంగా అధికార కాంగ్రెస్ అయిదు గ్యారంటీల అమలు, భారాస అవినీతి, ధరణి పోర్టల్ సమస్యలు, రైతు రుణమాఫీ, కేంద్రంలో బీజేపీ పదేండ్లు అధికారంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి లభించలేదని కాంగ్రెస్ ఆరోపిస్తూ వచ్చింది. ఉద్యోగాలతోపాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పూర్తిగా అమలు చేస్తామని, ఐదు న్యాయాలను అమలు చేస్తామని గడపగడపకు తీసుకెళ్లారు. అదేవిధంగా భాజపా కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కూడా పదే పదే ప్రచారం చేశారు. భాజపాని గట్టిగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ తమ వద్ద ఉన్న అస్త్రశస్త్రాలను అన్నింటిని ఉపయోగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.