AP Rains: ఏపీతో పాటు తెలంగాణకూ భారీ వర్ష సూచన..
AP Rains: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.;
AP Rains (tv5news.in)
AP Rains: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం.. అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది పశ్చిమ, వాయువ్య దిశగా కదిలి శ్రీలంక, దక్షిణ తమిళనాడులో తీరం చేరే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఏపీలోనూ పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కోరారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు. డిసెంబర్ 15 వరకు నైరుతి బంగాళాఖాతంలో వరుసగా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
తమిళనాడులో మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఇవాళ ఎల్లో అలర్ట్, రేపు, ఎల్లుండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే భారీ వర్షాలకు 4 ఇళ్లు కుప్పకూలాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు చెన్నైని అతలాకుతలం చేయగా చాలా ప్రాంతాలు ఇంకా బురదలోనే ఉన్నాయి. వేలూరు జిల్లా పాలారులో కురిసిన భారీ వర్షాలు 120 ఏళ్ల క్రితం నాటి రికార్డును సమం చేశాయి. పాలారు నదిలో వరద ధాటికి 16 ఇళ్లు కొట్టుకుపోయాయి. 6 వేలకు పైగా చెరువులు పొంగిపొర్లుతున్నాయన్నారు తమిళనాడు అధికారులు.