TELUGU MAHASABHA: అట్టహాసంగా తెలుగు మహాసభలు
పాల్గొన్న సుప్రీంకోర్టు జడ్డీ జస్టిస్ శ్రీనరసింహ.. సభల్లో జేడీ లక్ష్మీనారాయణ కీలకోపన్యాసం..తెలుగు గొప్పతనం చాటేలా సభా ప్రాంగణం
ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరులో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరగనున్న ఈ వేడుకలకు తెలుగు భాషాభిమానులు, సాహితీప్రియులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెలుగు మహాసభల వేదిక వద్ద.. రామోజీరావు కళాప్రాంగణం, ఎన్టీఆర్ ప్రాంగణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన రామోజీరావు విగ్రహాన్ని చూసినవారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు భాషకు ఆయన చేసిన కృషిని కొనియాడుతున్నారు.
హాజరైన సుప్రీంకోర్టు సీజే
మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ పాల్గొని ప్రసంగించారు. ‘‘ఇంత పెద్ద తెలుగు సభ జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. మనిషికి పుట్టుకతోనే మాతృబంధం, భాషాబంధం ఏర్పడతాయి. భాష కేవలం భావవ్యక్తీకరణకు మాత్రమే కాదు. ఒక ప్రపంచాన్ని సృష్టించేంత బలం భాషలో ఉంది. మనందరం భాష వల్ల బంధువులం. తెలుగు భాష వల్ల మనకు ఓ గుర్తింపు ఉంది. అధికార వ్యవహారాల్లో తప్పనిసరిగా తెలుగు ఉండాలి. జిల్లాస్థాయి వరకు కోర్టు కార్యకలాపాలు తెలుగులో జరగాలి. ’’ అని ఆకాంక్షించారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ మహోత్సవం తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలకు అంకితమై సాగనుంది. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన వేలాది మంది తెలుగు భాషాభిమానులు, రచయితలు, కవులు, మేధావులతో గుంటూరు నగరం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ప్రారంభ వేడుకల నుంచే మహాసభల ప్రాంగణం సందడిగా మారింది. సంప్రదాయ సంగీతం, నృత్యాలు, వేదిక అలంకరణ, తెలుగు నుడికారం ప్రతిబింబించే శిల్పాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
మాతృభాషలోనే చదివారు: లక్ష్మీనారాయణ
‘‘ఐదో తరగతి వరకు మాతృభాషలోనే చదవాలని జాతీయ విద్యా విధానం చెబుతోంది. నాకు తెలుగు బాగా వచ్చు కాబట్టే ఐదు భాషాలు నేర్చుకున్నా. ప్రపంచంలో వివిధ రంగాల ప్రముఖులు వారి మాతృభాషలో చదువుకున్నారు. ఇంగ్లీష్ వల్లే ఉద్యోగాలు రావు. విషయ పరిజ్ఞానం ఉంటే వస్తాయి. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఈ విషయంపై దృష్టి పెట్టాలి’’ అని పూర్వ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు.
మహాసభల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ప్రాంగణం కూడా ప్రత్యేక కేంద్రంగా నిలుస్తోంది. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితం, సేవలను స్మరించుకునేలా ఈ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఆయన నటన, రాజకీయ ప్రయాణం, తెలుగు ప్రజలపై చూపిన ప్రభావాన్ని వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శనలు యువతను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మహాసభల్లో పాల్గొనడానికి గుంటూరు నగరానికి వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి తెలుగు ప్రేమికులు తరలివచ్చారు. విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, పరిశోధకులు, రచయితలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. తెలుగు భాష భవిష్యత్, ఆధునిక సాంకేతికతతో భాష అనుసంధానం, డిజిటల్ యుగంలో తెలుగు పాత్ర వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే, ప్రాచీన గ్రంథాల పరిరక్షణ, కొత్త రచనలకు ప్రోత్సాహం వంటి అంశాలపై తీర్మానాలు తీసుకునే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.