ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్‌కి అడ్డుపడ్డారు ఇటీవల తమ కుమార్తెను కోల్పోయిన తల్లిదండ్రులు. తమ కుమార్తె ఆత్మహత్య కేసులో న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ వేడుకున్నారు.కోనసీమ జిల్లా చెముడులంకలో శ్రీ షిరిడీ సాయి ప్రైవేట్ స్కూల్‌లో పదో తరగతి విద్యార్థిని వెన్నెల గత నెల 17న ఆత్మహత్యకు పాల్పడింది. దసరా సెలవులు ఇవ్వకపోవడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన తన కుమార్తెను స్కూల్ యాజమాన్యం వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు ఆలమూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెన్నెల ఆత్మహత్యపై విద్యార్థి సంఘాలు.. ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారానే తమకు న్యాయం జరుగుతుందని భావించిన తల్లిదండ్రులు రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు వచ్చామని తెలిపారు. తిరుగు ప్రయాణంలో వారిని ఎయిర్‌పోర్టులోనే కలుస్తానంటూ.. ఓఎస్డీని వారి వద్దకు పంపించారు పవన్ కల్యాణ్.