మందుకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మందు మాన్పించేందుకు కుటుంబ సభ్యులు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం అంతగా ఉండదు. అయితే మద్యం మాన్పించే దేవుడు ఉన్నాడని మీకు తెలుసా?. అవును మీరు విన్నది నిజమే. ఇప్పుడు చెప్పే స్వామిని దర్శించుకోవడం వల్ల మనిషి మద్యం మానేస్తాడట. ఇక్కడి స్వామి మాలధారణ మాదకద్రవ్యాలకు విరుగుడా అంటే అవుననే అంటున్నారు మందు బాబులు. అసలు ఈ గుడి ఎక్కడ ఉంది.. దీన్ని చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కర్ణాటకలోని ఉడిపి దేవాలయంలో కొలువైన పాండు రంగడు మాదిరిగా ఏపీలోనూ పాండురంగ ఆలయం ఉంది. అనంతపురం జిల్లాలోని ఉంతకల్లులో ఈ దేవాలయం ఉంది. ఇక్కడ స్వామివారు ఎంతో మహిమ కలవారని భక్తుల విశ్వాసం. గ్రామస్తులందరూ భక్తి శ్రద్దలతో పూజా కార్యాక్రమాలను నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా మద్యానికి బానిసైన వారు ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకుని పాండురంగ మాల ధరిస్తే మళ్ళీ జన్మలో మద్యం తాగారని నమ్మకం. అంతేకాదు ఇందుకు ఉదాహరణగా మాలవేసుకుని మద్యం తాగడం మానేసిన ఎంతో మంది వ్యక్తులను గ్రామస్థులు సాక్ష్యంగా చూపిస్తుంటారు.
ఈ మాలను ఎప్పుడుబడితే అప్పుడు, ఏరోజు బడితే అప్పుడు ధరించకూడదు. మాల ధరించడానికి కొన్ని నియమాలున్నాయి. ఈ మాలధారణను నెలలో కేవలం రెండు రోజుల మాత్రమే వేయాల్సి ఉంటుంది. అది కూడా ఏకాదశి తిధి రోజునే. నెలకు రెండు ఏకాదశి తిధులు ఉంటాయి శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి. కనుక నెలలో ఈ రెండు రోజుల్లోనే మాల ధరించాలి. దీంతో మద్యం అలవాటుకి గుడ్ బై చెప్పాలి అనుకునే మందు బాబులు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ రెండు రోజులు భారీ సంఖ్యలో స్వామివారి గుడికి చేరుకుంటారు.
పాండురంగ మాల ధరించాలనుకొనేవారు ముందుగా అంటే ఏకాదశి తిది కంటే కొన్ని రోజులు ముందుగా ఆలయం వద్ద రూ.100 చెల్లించి ఒక టోకెన్ తీసుకోవాలి. ఎందుకంటే ఏకాదశి ముందు రోజు అర్ధరాత్రి నుంచి ఆ మాలను పాండురంగ స్వామి వారి సన్నిధిలో ఉంచి పూజలు, భజనలు చేస్తారు. తర్వాత ఏకాదశి సూర్యోదయ సమయంలో నిద్రలేచి స్నానమాచరించి స్వామీ వారి ఆలయానికి చేరుకోవాలి. ఆలయ ప్రాంగణంలో టోకెన్ నెంబర్ ప్రకారం క్యూ లైన్లో నిలబడాలి. తర్వాత ఆలయ ప్రధాన పూజారి టోకెన్ నెంబర్ ఆధారంగా మెడలో మాలను ధరింపజేస్తాడు.
ఏకాదశి రోజున వచ్చే భక్తులందరికీ గ్రామస్తులే ఉచిత భోజనాన్ని అందిస్తారు. మాల నిమిత్తం ఇచ్చిన 100 రూపాయలు తప్ప ఇక దేనికీ డబ్బులు తీరుకోరు. పాండురంగ మాలధారణ చేసిన భక్తులు వరుసగా మూడు ఏకాదశ తిధుల్లో పాండు రంగడి దర్శనం చేసుకోవాలి. మాల ధారణ చేసిన వ్యక్తులు ఆలయ ప్రాంగణంలో నిద్ర చేయాలి. ఇలా మూడు ఏకాదశులు నిద్ర చేసిన తర్వాత మాలను తీయవచ్చు. ఇక ఈ ఆలయానికి చేరుకోవడానికి పలు మార్గాలు ఉన్నాయి. అయితే దూరప్రాంతం నుంచి వచ్చే భక్తులు రాయదుర్గం వరకు ట్రైన్లో చేరుకుని.. అక్కడి నుంచి ఆటోలో ఉంతకల్లు పాండురంగ స్వామి ఆలయానికి చేరుకోవడం ఈజీగా ఉంటుంది.