VIAJYASAI: జగన్‌కు విజయసాయిరెడ్డి కౌంటర్
క్యారెక్టర్ ఉన్నోడిని అంటూ ట్వీట్... వైసీపీలో టెన్షన్ పెంచిన విజయసాయి;
క్యారెక్టర్ ఉన్న వారే పార్టీలో ఉంటారని విజయసాయిరెడ్డిని ఉద్దేశించి వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. తాజాగా జగన్‌కు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. 'వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే ఎవరికీ, ఎలాంటి ప్రలోభాలకూ లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు. కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలను వదులుకున్నా'. అంటూ ట్వీట్ చేశారు. విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికీ ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు మాజీ ఎంపీ. ఇప్పుడు సాయిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
జగన్ వ్యాఖ్యలతోనే అదిరిపోయే కౌంటర్
జగన్ ఎప్పుడూ చెప్పే విలువలు, విశ్వసనీయత అనే వ్యాఖ్యలనే ఆధారం చేసుకుని... విజయసాయిరెడ్డి ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటివరకూ జగన్ కు నమ్మినబంటుగా ఉంటూ.. అన్ని విషయాలు అండగా నిలిచిన విజయసాయి రెడ్డి.. ఇప్పుడు నేరుగా జగన్ ను లక్ష్యంగా చేసుకుని స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం... వైసీపీ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. విజయసాయి చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది.
విజయసాయి రూటు అటేనా..?
సాధారణంగా జగన్ వ్యాఖ్యలకు ఎప్పుడూ కౌంటర్ ఇవ్వని విజయసాయిరెడ్డి తొలిసారిగా గట్టిగానే కౌంటర్ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే వైసీపీకి గట్టి కౌంటర్ ఇస్తున్న విజయసాయి.. బీజేపీకి చేరువ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదటి నుంచి బీజేపీకి అనుకూలంగా ఉంటున్న విజయసాయి... కమలం పార్టీలో చేరేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.