Madanapalle (AP) : తల్లికి వందనం డబ్బులు.. భర్తను భార్య హత్య

Update: 2025-07-09 09:15 GMT

తల్లికి వందనం డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదని భర్తను అతని భార్య హత్య చేసింది. ప్రభుత్వం తన బిడ్డల చదువు కోసం వచ్చిన డబ్బును భర్త మద్యం తాగేందుకు తీసుకున్నాడన్న కోపంతో అతడిని చంపిన భార్యను పోలీసులు అరెస్టు చేసారు. మదనపల్లి తాలూకా సిఐ కళా వెంకటరమణ కథనం మేరకు... మదనపల్లె మండలం రెడ్డిగానిపల్లెకు చెందిన వంకోళ్ల చంద్రశేఖర్ (46) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవాడు. 20 ఏళ్ల కిందట అతనికి రమాదేవితో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

చంద్రశేఖర్ నిత్యం మద్యం తాగి కుటుంబాన్ని పట్టించుకోలేదు. ఈ క్రమంలో రమాదేవి పాలెంకొండకు చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లలిద్దరికీ తల్లికి వందనం డబ్బు రూ. 26 వేలు రమాదేవి ఖాతాలో పడింది. ఈ డబ్బు ఆమె ఏటీఎం కార్డు ద్వారా చంద్రశే ఖర్ తీసుకున్నాడు. ఆ డబ్బు ఇవ్వాలని భార్య భర్తతో గొడవ పెట్టుకుంది. ఈ నెల 2వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో చంద్రశేఖర్ మద్యాన్ని గ్లాసులో పోసి ఇవ్వమని భార్యకు చెప్పాడు. దీంతో రమాదేవి మద్యంలో విషం కలిపి ఇచ్చింది. దాన్ని తాగిన అతను మళ్లీ భార్యతో గొడవపడ్డాడు. ఈ గొడవలో ఆమె భర్త గొంతును నులిమి, కర్రతో కాలిపై కొట్టింది. దీంతో చంద్రశేఖర్ నడవలేక అక్కడే పడిపోయి వేకువజామున రక్తం కక్కుకుని మృతి చెందాడు.

రక్తం మొత్తం శుభ్రం చేసిన రమాదేవి కూలీపనులకు వెళ్లిపోయింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన ఆమె మద్యం తాగడంతో తన భర్త చనిపోయినట్లు చుట్టుపక్కల వారికి తెలిపింది. విషయం తెలుసుకున్న మృతుడి సోదరుడు మహేశ్ గ్రామానికి చేరుకుని సోదరుడి శరీరంపై గాయాలుండటంతో పోలీసులకు ఫిర్యాదు. చేశాడు. దీంతో అప్పట్లో అనుమానాస్పదమృతి కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మద్యంలో విషం కలపడం, గొంతు నులమడం ద్వారా మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. దీంతో రూరల్ సీఐ కళా వెంకటరమణ తమ సిబ్బందితో రమాదేవిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకుంది. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ వెల్లడించారు.

Tags:    

Similar News