ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఉప ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ మరియు సర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉండటంతో, ఆయా స్థానాలకు మాత్రమే ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జూలై 28న నోటిఫికేషన్ విడుదలైంది. రామకుప్పం, కారంపూడి, విడవలూరు ఎంపీటీసీ స్థానాలకు, పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు, కొండపూడి, కడియపులంక సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఆగస్టు 12న జరుగుతాయి. ఆగస్టు 14 ఓట్లు లెక్కిస్తారు. సర్పంచ్ ఎన్నికలు ఆగస్టు 10న జరుగుతాయి. ఫలితాలు అదే రోజున ప్రకటిస్తారు. పులివెందుల జడ్పీటీసీ మూడేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఒంటిమిట్ట జడ్పీటీసీగా గెలిచి జడ్పీ చైర్మన్ గా పదవి చేపట్టిన ఆకేపాటి అమర్నాత్ రెడ్డి రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దాంతో ఆయన జడ్పీటీసీగా రాజీనామా చేశారు. ఇప్పుడు ఈ రెండు స్థానాల్లో ఉపఎన్నిక అనివార్యమయింది.