కడప జిల్లాలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఛైర్మన్ పీఠం కాపాడుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్, బెంగళూరుకు జెడ్పీటీసీలను తరలించారు. వైసీపీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఈ నెల 27న కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. రాజంపేట ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లా పరిషత్ ఇంచార్జీ చైర్మన్ జేష్టాది శారద పదవిలో ఉన్నారు. వైసీపీ అధిష్టానం బ్రహ్మంగారి మఠం జడ్పీటిసి రామగోవింద రెడ్డికి ఖరారు చేసింది. టిడిపి పోటీ చేస్తుందా తప్పుకుంటుందా అనేది వేచి చూడాలి. మొత్తం 50 జడ్పీటీసీలలో ఒకరు రాజీనామా చేయగా, మరో రెండు స్థానాలు ఖాళీ ఉన్నాయి. మొత్తం 47 మంది జడ్పీటీసీలు ఉన్నారు. టీడీపీకి ప్రస్తుతం 9మంది జడ్పీటీసీలు ఉన్నారు. వైసీపీకి 38 మంది జడ్పీటీసీలు ఉన్నారు. మెజారిటీ వైసీపీకి ఉన్నా టీడీపీ గట్టిగా ప్రయత్నాలు మొదలు పెడితే బేరసారాలు నడవడం గ్యారెంటీ అని భావిస్తున్నారు.