CRIME: దళిత యువకుడి హత్య కేసులో ఏ1గా మాజీ మంత్రి కుమారుడు

ఏ1గా వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ కుమారుడు... పరారీలో పినిపే శ్రీకాంత్‌;

Update: 2024-10-21 01:30 GMT

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం అయినవిల్లికి చెందిన దళిత యువకుడు మిస్సింగ్‌.. తర్వాత అనుమానాస్పద మృతి కేసులో వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ కుమారుడు పినిపే శ్రీకాంత్‌ పేరును ఏ1 గా చేర్చడం.. ఒక్కసారిగా చర్చనీయాంశం అయ్యింది.. దళిత యువకుడిది హత్యే అని విచారణ ద్వారా పోలీసులు నిర్ధారించారు. పినిపే శ్రీకాంత్‌ ఆదేశాలమేరకే దళిత యువకుడు జనుపల్లి దుర్గాప్రసాద్‌ను హత్య చేశారని పోలీసుల అదుపులో ఉన్న ధర్మేష్‌ అనే యువకుడు పోలీసుల విచారణలో తెలపడం కలకలం రేపింది. మంత్రి కుమారుడు శ్రీకాంత్‌ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.. ఈ కేసు మొత్తం వ్యవహారంలో మరో నలుగురు ఉన్నట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకొచ్చినట్లు తెలుస్తోంది.


అసలేం జరిగింది

కోనసీమ అల్లర్ల సమయంలో అయినవిల్లికి చెందిన వాలంటీరు దుర్గాప్రసాద్‌ను 2022 జూన్‌ 6న హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వైసీపీ సోషల్‌ మీడియా కన్వీనర్, మృతుడికి స్నేహితుడైన వడ్డి ధర్మేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతడిని ఈ నెల 18న అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కేసులో మరో నలుగురు నిందితులతోపాటు పినిపె శ్రీకాంత్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించగా, కేసు దర్యాప్తు సాగుతోందని.. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కొత్తపేట డీఎస్పీ గోవిందరావు విచారణాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 18న ధర్మేశ్‌ను విచారించి, వివరాలు సేకరించినట్లు తెలిసింది. అతడు.. మృతుడు దుర్గాప్రసాద్, శ్రీకాంత్‌లకు సన్నిహితంగా ఉంటూ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

పక్కా ప్లాన్..!

దుర్గాప్రసాద్‌ను హత్య చేయించేందుకు నిర్ణయించిన శ్రీకాంత్‌.. ధర్మేశ్‌ సహాయం కోరి, మరో నలుగురికి ఆ బాధ్యత అప్పగించినట్లు విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది. హత్యకు స్థానికంగా ఓ ప్రముఖ లాడ్జిలో పథక రచన చేసినట్లు సమాచారం. దుర్గాప్రసాద్‌ను ధర్మేశ్‌ కోటిపల్లి రేవు వద్దకు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లగా, వెనుక కారులో నలుగురు అనుసరించారు. రేవు వద్ద ఓ వ్యక్తి పడవలో లోపలకు తీసుకెళ్లగా, కారులో వచ్చిన వారిలో ముగ్గురు దుర్గాప్రసాద్‌ మెడకు తాడు బిగించి, హత్య చేశారని నిందితుడు ధర్మేశ్‌ చెప్పినట్లు తెలిసింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు తొలుత మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశారు. కొన్నాళ్లకు మృతదేహం లభించడం, పోస్టుమార్టంలో హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. దుర్గాప్రసాద్‌ను హత్య చేసిన నిందితుల్లో కొందరు ముమ్మిడివరం మండల పరిధిలో జరిగిన మరో హత్యలోనూ ప్రధాన నిందితులుగా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News