AP: వల్లభనేని వంశీ అరెస్ట్‌కు రంగం సిద్ధం !

అమెరికా వెళ్లిపోయి ఉంటారనే అనుమానాలు.... హైదరబాద్‌కు మూడు ప్రత్యేక బృందాలు;

Update: 2024-08-02 05:00 GMT

కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు రంగం సిద్ధం చేశారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని 71వ ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్టు చేశారు. దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా... ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే వైసీపీ మూకలు విధ్వంసం సృష్టించాయనే ఆరోపణలున్నాయి. మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడం, దాదాపుగా వంశీ సొంత మనుషులుగా చెలామణి అయిన పోలీసులే కీలక స్థానాల్లో ఉండడంతో ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీ అరాచకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. టీడీపీ కార్యాలయంపై దాడికి కారకులపై చర్యలు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు గత నెల 9న బాపులపాడు ఎంపీపీ నగేష్‌ సహా 15 మందిని, తర్వాత మరో ముగ్గురిని అరెస్టు చేశారు. మిగతావారు పరారీలో ఉన్నారు.

పోలీసులు వంశీ సహా పలువురు కీలక నిందితుల్ని వదిలేశారంటూ టీడీపీ శ్రేణుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. పైగా టీడీపీ పెద్దలు కూడా వంశీ గతంలో చేసిన వ్యాఖ్యలు, నాలుగేళ్లుగా పార్టీ శ్రేణుల్ని వేధించడం, నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సందర్భంగా అక్రమ కేసులు పెట్టించడాన్ని తీవ్రంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వంశీని అరెస్టు చేయాలనే ఒత్తిడి పెరిగింది. జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గంగాధరరావు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. వంశీ కుటుంబం హైదరాబాద్‌లోనే నివసిస్తుండడం, ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన కూడా అక్కడే ఉంటున్నట్లు తెలియడంతో పోలీసులు అరెస్టుకు కార్యాచరణ చేపట్టారు. గురువారం మూడు ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌ వెళ్లాయి. అయితే వంశీ ఇప్పటికే అమెరికా వెళ్లిపోయి ఉంటారనే ప్రచారం జరుగుతోంది.

వెంకటరెడ్డిపై వేటు...

ఆంధ్రప్రదేశ్‌లో ఖనిజ సంపదను అడ్డగోలుగా దోచుకునేందుకు సహకరించిన గత ప్రభుత్వంలో గనుల శాఖ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డిపై వేటుపడింది. ఇసుక తవ్వకాలు, విక్రయాలు, టెండర్లు, ఒప్పందాలు.. ఇలా అన్ని దశల్లోనూ అక్రమాలకు పాల్పడటం, ప్రైవేటు సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చడం, ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించారన్న కారణాలతో ఆయణ్ను సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్స్‌లో సీనియర్‌ సివిలియన్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌ అయిన వెంకటరెడ్డి 2019 డిసెంబర్‌లో ఏపీకి డిప్యుటేషన్‌పై వచ్చి, తొలుత విద్యాశాఖలో చేరారు. ఆనక గనుల శాఖ డైరెక్టర్‌గా, కొన్నాళ్లకు ఏపీఎండీసీ ఎండీగానూ బాధ్యతలు చేపట్టారు. గనుల శాఖలో ఆయన అక్రమాలపై తీవ్ర ఆరోపణలు రావడంతో, ఎన్డీయే ప్రభుత్వం రాగానే జూన్‌ 7న వెంకటరెడ్డిని ఆ రెండు పోస్టుల్లోంచి తొలగించింది.

Tags:    

Similar News