YCP: వైసీపీకి దెబ్బ మీద దెబ్బ
వరుసగా పార్టీని వీడుతున్న కీలక నేతలు... ఉనికి నిలుపుకోవడం కోసం వైసీపీ తీవ్ర ప్రయత్నాలు;
ఎన్నికల్లో పరాజయం తర్వాత వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే బాలినేని వైసీపీకి షాక్ ఇవ్వగా.. తాను కూడా రాజీనామా చేస్తున్నట్లు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ప్రకటించారు. తనతో పాటు కలిసి ప్రయాణం చేసిన వారిని జనసేనలోకి ఆహ్వానిస్తున్నానని అన్నారు.
బాలినేని గుడ్ బై
ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. కొద్దిరోజులుగా వైసీపీ అధిష్టానం మీద అసంతృప్తితో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఆ పార్టీని వీడారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజీనామా లేఖను కూడా పంపించారు. 2014లో వైసీపీ నుంచి పోటీచేసి ఓడిపోయిన బాలినేని శ్రీనివాసరెడ్డి.. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక.. తొలి రెండున్నరేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. అయితే మంత్రివర్గ పునర్వస్థీకరణలో అప్పట్లో మంత్రి పదవి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డిని తప్పించారు. అప్పటి నుంచి ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది.
మరో వికెట్ డౌన్
ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ ముఖ్య నాయకుల్లో ఒకరైన సామినేని ఉదయభాను పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. 2019లో జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉదయభాను సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి ఆశించినా సామాజిక సమీకరణల్లో భాగంగా కృష్ణా జిల్లాలో పేర్ని నానికి పదవి వరించింది.2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైనప్పటి నుంచి ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరిగా ప్రత్యామ్నయం చూసుకుంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులెవరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ముందుకు రావడం లేదు. తాజాగా బాలినేని సైతం వైసీపీని వీడనుండటంతో జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా అదే బాటలో పయనించాలని నిర్ణయించుకున్నారు.తన అనుచరులతో కలిసి జనసేనలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం జగ్గయ్యపేటలో టీడీపీ తరపున శ్రీరాం తాతయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. 2014-19 మధ్య శ్రీరాం తాతయ్య జగ్గయ్యపేటలో గెలుపొందారు.