YS FAMILY: కోర్టు గదిలో నిలబెట్టడం కలచివేస్తోంది: విజయమ్మ
జగన్, భారతీ చేస్తోన్న ఆరోపణలు నిరాధారం... అదీ పూర్తిగా కుటుంబ ఒప్పందం;
వైసీపీ అధ్యక్షుడు జగన్ తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిల... జాతీయ కంపెనీ చట్ట ట్రైబ్యునల్ లో వేర్వేరుగా దాఖలు చేసిన కౌంటర్లు సంచలనం సృష్టించాయి. ఈ కౌంటర్లో విజయమ్మ సంచలన ఆరోపణలు చేశారు. ‘నా కుమారుడు జగన్, కోడలు భారతి చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాను. పిల్లల మధ్య వివాదం కారణంగా నేను కోర్టు గదిలో నిలబడాల్సి రావడం తీవ్రంగా కలచివేస్తోంది. జగన్, భారతి ఆరోపణలు నిరాధారం.’ అని పేర్కొన్నారు. సరస్వతి పవర్ కంపెనీలో తన పేరు మీద, తన భార్య భారతి, క్లాసిక్ రియాలిటీ పేరు మీద ఉన్న షేర్లను తన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని జగన్.. ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఎన్సీఎల్టీ విచారించింది. కౌంటర్ దాఖలు చేయడానికి విజయమ్మ, షర్మిల తరఫు న్యాయవాదులు సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను ఎన్సీఎల్టీ మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది.
అదీ కుటుంబ ఒప్పందం
కంపెనీ వాటాలను చట్టబద్ధంగా బహుమతిగా ఇస్తూ చేసుకున్న కుటుంబ ఒప్పందంలో.. జాతీయ కంపెనీ చట్ట ట్రైబ్యునల్ జోక్యం చేసుకోజాలదని విజయమ్మ, షర్మిలా తెలిపారు. ఫ్యామిలీ సెటిల్‌మెంట్‌లో జోక్యం చేసుకునే అధికారం ట్రైబ్యునల్ కు లేదని వెల్లడించారు. కుటుంబ వివాద పరిష్కారాలు ట్రైబ్యునల్ పరిధిలోకి రావని పేర్కొన్నారు. . తనకు చెప్పకుండా విజయమ్మ, షర్మిల షేర్లు బదిలీ చేసుకున్నారని ఆయన ఆరోపించారు. షేర్ల బదిలీ పత్రాలు సమర్పించకుండానే మార్చుకున్నారని చెప్పారు. వైఎస్ జగన్, భారతి, క్లాసిక్ రియాలిటీల పేరిట షేర్లు కొనసాగేలా చూడాలని పేర్కొన్నారు. 51.01 శాతం షేర్లు యథావిధిగా ఉండాలని కోరారు.
తదుపరి విచారణ ఎప్పుడంటే..?
విజయలక్ష్మి, షర్మిల తదితరుల తరఫున న్యాయవాది విశ్వరాజ్ వాదనలు వినిపించారు. ఆన్‌లైన్‌లో తాము కౌంటర్లు దాఖలు చేశామని.. ఒకట్రెండు రోజుల్లో భౌతికంగా సైతం ధర్మాసనానికి సమర్పిస్తామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ట్రైబ్యునల్.. తదుపరి విచారణను మార్చి 6కు వాయిదా వేసింది.