YS RAJAREDDY: రాజకీయాల్లోకి వైఎస్సార్ వారసుడు
వైఎస్ షర్మిల కుమారుడి రాజకీయ ఎంట్రీ...మేనమామ జగన్‌కు వైఎస్ రాజారెడ్డి షాక్... షర్మిలతో కలిసి రాజారెడ్డి కర్నూలు పర్యటన
దివంగత నేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం నుంచి మరొకరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ మనవడు, షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి రంగప్రవేశానికి రంగం సిద్ధమయినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. సోమవారం షర్మిల కర్నూలు ఉల్లి మార్కెట్‌ను సందర్శించేందుకు వెళ్లారు. అయితే.. ఎన్నడూ లేనిది రాజకీయ పర్యటనలో షర్మిల వెంట ఆయన కుమారుడు రాజారెడ్డి రావడం హాట్ టాపిక్‌గా మారింది. కర్నూలు పర్యటనకు వచ్చేముందు ఇంటి వద్ద అమ్మమ్మ విజయలక్ష్మి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయనకు ఇదే మొట్టమొదటి రాజకీయ యాత్ర. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఇప్పటికే వైఎస్ఆర్ కుటుంబం నుంచి నలుగురు, అయిదుగురు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. వైసీపీ అధినేత జగన్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సహా పలువురు ఇప్పటికే రాజకీయాల్లో ఉండగా.. తాజాగా రాజారెడ్డి ఎంట్రీ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లో తాత రాజకీయ వారసత్వాన్ని రాజారెడ్డికి ఇచ్చే ప్లాన్ షర్మిల చేస్తున్నారు.
కాంగ్రెస్ అధిష్టానం వ్యూహమా?
2024 ఎన్నికలకు ముందు తన అన్న అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో విభేదించి తెలంగాణలో సొంత పార్టీ పెట్టారు షర్మిల. తర్వాతి పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ లో చేరి ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. ఆమె ఆధ్వర్యంలో 2024 ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు గెలవకపోయినా జగన్ ఓటమిలో తమదైన పాత్ర పోషించామని షర్మిల వర్గం చెబుతోంది. అయితే అదే సమయంలో షర్మిల పోకడతో విభేదించి కొంతమంది కీలక నేతలు పార్టీకి దూరమయ్యారు. మరోవైపు జగన్ పార్టీ నుంచి భారీగా వలసలు ఉంటాయని ఊహించిన షర్మిలకు ఇంతవరకూ అలాంటి సూచనలు పెద్దగా కనిపించలేదు. దాంతో వైయస్ రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి ల రాజకీయ వారసుడిగా తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి దింపాలని ఆమె భావిస్తోంది. తల్లి ద్వారా రెడ్డి, తండ్రి ద్వారా బ్రాహ్మణ లతో పాటు క్రిస్టియన్ వర్గాలను కూడా రాజారెడ్డి ద్వారా పార్టీ వైపు ఆహ్వానించొచ్చని వైయస్ షర్మిల ఆలోచనగా ఉంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ మేరకు షర్మిలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.