వైసిపి పార్టీ అధికారం పోయిన తర్వాత కూడా రకరకాల అరాచకాలకు తెరతీస్తోంది. ఎలాగైనా సరే కూటమి ప్రభుత్వానికి మచ్చ తీసుకురావడానికి చేయని తప్పులు అంటూ లేవు. తిరుమల కొండమీద ఎన్ని కుట్రలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గతంలో గోశాలలో ఆవులు చనిపోతున్నాయి అంటూ తప్పుడు ప్రచారానికి తెరతీశారు. బిఆర్ నాయుడు గారి ఇమేజ్ ను, తిరుమల ప్రతిష్టను దెబ్బతీయడానికి భూమన చేయని కుట్రలు అంటూ లేవు. గోవుల మరణాలు అంటూ ప్రచారం చేసి అడ్డంగా దొరికిపోయాడు భూమన. దాని తర్వాత టికెట్ల విషయంలో ఏదో జరుగుతుంది అంటూ కట్టు కథ అల్లి బుక్ అయిపోయారు. ఇప్పుడు ఖాళీ మద్యం సీసాలను తిరుమల కొండ మీద కౌస్తుభం గెస్ట్ హౌస్ వద్ద పడేసి మళ్ళీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఖాళీ బాటిళ్లు పడేసింది భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు, సాక్షి ఫోటోగ్రాఫర్. వాళ్లందరూ కుట్రపూరితంగానే ఈ పని చేశారు.
దీని ఆధారంగా సాక్షి మీడియాలో ప్రస్తుత టీటీడీ బోర్డు మీద తప్పుడు కథనాలు రాయించారు. పోలీసులు విచారణ చేసి ఈ మద్యం సీసాలు పడేసింది భూమున అనుచరులే అని తేల్చారు. ఆ మద్యం సీసాల మీద ఉన్న లేబుల్ వివరాలను బట్టి.. వాటిని ఎక్కడ కొన్నారు, ఎవరు కొన్నారు, సీసీటీవీ ఫుటేజ్, ఫాస్ట్ ట్యాగ్ వివరాలను బయటకు తీస్తే.. భూమన కుట్రలు బట్టబయలు అయ్యాయి. మొన్నటిదాకా ఈ విషయం మీద రెచ్చిపోయి మాట్లాడిన భూమన.. అసలు నిజాలు బయటపడేసరికి సైలెంట్ అయిపోయారు. కేవలం తిరుపతి మీదనే కాదు.. ఏపీలో ఉన్న అన్ని హిందూ ఆలయాలపై వైసీపీ ఇలాగే కుట్రలు చేస్తోంది. ఎంతసేపు కూటమి ప్రభుత్వంకు తప్పుడు పేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే అక్కడ ఏదో జరిగిపోతుంది అంటూ భక్తుల నమ్మకాన్ని దెబ్బతీయడానికి చూస్తోంది.
మొన్నటికి మొన్న సింహాచలం ఆలయంలో ప్రసాదం విషయంలో ఇలాంటి ప్రచారమే జరిగింది. చివరకు అదంతా ఫేక్ అని అధికారులు తేల్చడంతో వైసిపి సోషల్ మీడియా దెబ్బకు సైలెంట్ అయింది. ఏపీలో ఏ ఆలయంలో ఏ చిన్న విషయం బయటకు వచ్చినా సరే కూటమి ప్రభుత్వానికి అంటగట్టేసి తప్పుడు ప్రచారాలు చేయడానికి రెడీగా ఉంటుంది వైసీపీ సోషల్ మీడియా అండ్ సాక్షి మీడియా. చివరకు నిజాలు బయటపడటంతో నోరు మూసుకుంటుంది ఈ వైసీపీ బ్యాచ్. వీళ్ళ వ్యవహారంపై హిందూ భక్తులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దేవుడి ఆలయాలతో ఆటలేంటి అంటూ మండిపడుతున్నారు. కానీ వైసీపీ వాళ్లకు దేవుడు అంటే కొంచెం కూడా భయం లేనట్టు వ్యవహరిస్తున్నారు.