అమరావతి రాజధాని మీద మాజీ సీఎం జగన్, ఆ పార్టీ నేతలు అవసరానికో మాట, పూటకో విధానాన్ని బయటపెడుతున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఏపీకి అమరావతి రాజధానిగా ఉండాలని సెలెక్ట్ చేశారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. 2019 ఎన్నికలకు ముందు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. తాను ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని.. ఇదే రాజధాని అని డైలాగులు కొట్టారు. పైగా ఎన్నికల ప్రచారంలో భాగంగా అమరావతి రైతుల వద్దకు వెళ్లి.. చంద్రబాబు నాయుడు కొన్ని గజాలు మాత్రమే ఇచ్చాడు తాను అంతకంటే ఎక్కువ ఇస్తాను అంటూ లేనిపోని మాయమాటలు చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే తన అసలు రూపాన్ని బయట పెట్టాడు. మూడు రాజధానులు అంటూ అరాచకానికి తెరలేపాడు. అమరావతి రైతులును ఎంత ఇబ్బంది పెట్టాలో అంత పెట్టేశాడు.
వైసిపి నేతల హింసను తట్టుకోలేక ప్రజలు అత్యంత దారుణంగా జగన్ పార్టీని ఓడించారు. 11 సీట్లకు పరిమితం అయిన తర్వాత ఆ మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తాము అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని జగన్ మాట కూడా ఇదే అంటూ తెలిపాడు. ప్రజలు అంతా నిజమే అనుకున్నారు. కానీ మొన్న జగన్ మీడియా ముందుకు వచ్చి అమరావతి అనే మాటే లేదు.. రాజధానికి చట్టబద్ధత లేదు.. అది నదీ గర్భంలో ఉంది.. నదిగర్భంలో ఎవరైనా రాజధాని కడతారా అంటూ లేనిపోని మాటలు మాట్లాడాడు. జగన్ మాటలపై ఏపీ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చి తాము ఎప్పటినుంచో అమరావతికి మద్దతు ఇస్తున్నామని.. జగన్ కూడా ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు అంటూ మళ్లీ మాట మార్చేశారు.
అటు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆ రోజుకు మా విధానం మూడు రాజధానులు అని.. ఇప్పుడు మా పాలసీ ఏంటి అనేది పార్టీలో చర్చించి చెబుదామంటున్నారు. అంటే రాజధాని విషయంలో వాళ్లకే ఒక క్లారిటీ లేదు. రోజుకో విధానాన్ని బయటపెడుతున్నారు. ఒకసారి అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న వైసిపి ఒక రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైన రాజధాని విషయంలో ఇన్ని మాటలు మాట్లాడవచ్చునా.. ప్రజల జీవితాలకు సంబంధించిన రాజధాని విషయంపై ఎన్ని తప్పుడు మాటలు ఏంటి అని కూటమినేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంటే ప్రజలు ఛీ కొడితే ఒక మాట.. లేదంటే మరో మాట అన్నట్టు వాళ్ళ విధానాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన మాటలు కూడా ఫైనల్ కాకపోవచ్చు. రేపు అవసరాన్ని బట్టి మరో మాట మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి.