ఉమ్మడి అనంతపురం జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర జైత్ర యాత్రలా సాగుతోంది. పసుపు జెండాలతో పాదయాత్ర దారులన్నీ నిండిపోయాయి. యువత కేరింతలు, అభిమానుల నినాదాలతో పుర వీధులు మారుమోగుతున్నాయి. యువగళం పాదయాత్ర నేపధ్యంలో లోకేష్ నడిచే పరిసరాలన్నీ జనసంద్రమయ్యాయి. తమ యువనేతను చూసేందుకు, ఆయనతో నడిచేందుకు అభిమానులు వేలాదిగా తరలివస్తున్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రజలు లోకేశ్‌తో కలిసి నడుస్తున్నారు. అంతటి ఎండలోనూ వేలాదిమంది వెంట నడవగా పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. స్థానిక యువత, నిరుద్యోగులు, మహిళలు లోకేశ్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకొన్నారు. లోకేశ్ అందరి సమస్యలు ఓపికగా వింటూ.. వారికి భరోసా కల్పిస్తూ ముందుకు కదులుతున్నారు. అధికారంలోకి రాగానే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానంటూ హామీ ఇస్తున్నారు.
చేనేత ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న లోకేష్ వారికి పలు హామీలిచ్చారు, చేనేత మగ్గాలకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేస్తామని.. పట్టు పరిశ్రమ రైతులకు రాయితీలు ఇచ్చి ఆదుకుంటామని తెలిపారు. పట్టు వస్త్రాలపై జీఎస్టీ లేకుండా చేస్తామన్నారు. జగన్ పనైపోయింది.. అందులో డౌట్ లేదన్న లోకేష్.. జగన్ చేసిన నష్టం అంతా ఇంతా కాదని మండిపడ్డారు.
ధర్మవరంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు,టీడీపీ నేత భరత్.లోకేష్ పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని అన్నారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, గ్రాడ్యుయేట్ ఎన్నిక తరహాలోనే సాధారణ ఎన్నికల్లో కూడా ప్రజలు టీడీపీకే పట్టం కడతారని అన్నారు భరత్.