ఆత్మనిర్భర్ భారత్‌కు సాక్షిగా కొత్త పార్లమెంట్ భవనం: ప్రధాని మోదీ

Update: 2023-05-28 09:39 GMT

కొత్త పార్లమెంట్ భవనం ఆత్మనిర్భర్ భారత్‌కు సాక్షిగా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. నూతన పార్లమెంట్ కేవలం భవనం కాదని.. 140 కోట్ల ప్రజల ఆకాంక్షలు, కలల ప్రతిబింబమని చెప్పారు. పాత, కొత్త కలయికల అస్తిత్వానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రపంచానికి భారత్ దృఢ సంకల్పం సందేశం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచం మొత్తం భారత్ సంకల్పం, అభివృద్ధిని గమనిస్తోందన్నారు. కొత్త ఆలోచనలు, సంకల్పంతో భారత్ ప్రగతి పథాన పయనిస్తోందని.. దేశ అభివృద్ధి.. ప్రపంచ వృద్ధికి ప్రేరణ అవుతుందని చెప్పారు. సేవా, కర్తవ్యానికి సెంగోల్ ప్రతీక అన్న ప్రధాని మోదీ.. రాజదండంకు పూర్వ ప్రతిష్ట, గౌరవం తీసుకురావాలన్నారు.

అంతకుముందు.. రెండో సెషన్‌లో నూతన పార్లమెంట్ భవనంలోకి ప్రధాని మోదీకి సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జాతీయ గీతాలాపనలో కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని ప్రారంభించారు. ఆ తర్వాత పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా 75 రూపాయల ప్రత్యేక నాణేం, పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. దేశ వికాస యాత్రలో ఎప్పటికీ నిలిచిపోయే కొన్ని గడియలు వస్తాయన్నారు. అమృతోత్సవ వేళ ఈ చరిత్రాత్మక ఘటనలో ప్రజలు భాగస్వాములయ్యారని ప్రధాని మోదీ చెప్పారు.

భారత దేశ చట్టసభలో కొత్త శకంగా నిలవనున్న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. రెండు సెషన్స్‌గా ఈ కార్యక్రమం జరిగింది. తొలుత పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి మొదట మోదీ నివాళులు అర్పించారు. ఆ తర్వాత నూతన ప్రజాస్వామ్య సౌధంలో శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన ప్రధాని.. అనంతరం సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం మఠాథిపతులు, వేదపండితులతో కలిసి కొత్త పార్లమెంట్‌లోకి అడుగు పెట్టారు. సరిగ్గా అనుకున్న సుముహూర్తం ప్రకారమే ప్రధాని మోదీ.. నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. స్పీకర్‌తో కలిసి లోక్‌సభ చాంబర్‌కు వెళ్లిన ప్రధాని మోదీ.. స్పీకర్‌ కుర్చీ దగ్గర రాజదండం ప్రతిష్టించారు. అనంతరం పార్లమెంట్ లాబీల్లో సర్వమత ప్రార్థనలు చేశారు. సర్వమత ప్రార్థనల తర్వాత పాత పార్లమెంట్ భవనంలోకి వెళ్లారు ప్రధాని.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా కేంద్రమంత్రులు, ఎంపీలు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలు రాష్ట్రాల సీఎంలు నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి, అస్సాం సీఎం హేమంత్ విశ్వశర్మ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర సింగ్ ధామితో పాటు ఇతర ముఖ్యమంత్రులు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌కు తరలివచ్చారు.

Similar News