2026 Auto Storm : అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, గ్లోబల్ డిజైన్లతో రాబోతున్న కార్ల లిస్ట్ ఇదే.
2026 Auto Storm : 2026 సంవత్సరం భారత ఆటోమొబైల్ రంగానికి ఒక వండర్ ఇయర్ కాబోతోంది. గతేడాది కంటే భిన్నంగా, ఈ ఏడాది ఏకంగా 30కి పైగా సరికొత్త కార్లు మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కేవలం చిన్నపాటి మార్పులు మాత్రమే కాకుండా, ఈసారి కంపెనీలు సరికొత్త జనరేషన్ మోడళ్లను, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలను భారీగా లాంచ్ చేయబోతున్నాయి. దీంతో 2026వ సంవత్సరం భారత రోడ్లపై కొత్త కళ రాబోతుంది. ఆటోమొబైల్ దిగ్గజాలు డిఫెన్సివ్ మోడ్ నుంచి అగ్రెసివ్ మోడ్‌లోకి మారిపోయాయి. ముఖ్యంగా రెనాల్ట్ తన ఐకానిక్ మోడల్ డస్టర్ నెక్స్ట్ జనరేషన్ మోడల్‌ను నేడు, అంటే జనవరి 26న లాంచ్ చేయబోతోంది. సుమారు రూ.10 లక్షల ప్రారంభ ధరతో రాబోతున్న ఈ కారు, ఎమ్‌ఎస్‌యువీ సెగ్మెంట్‌లో గట్టి పోటీని ఇవ్వనుంది. దీనితో పాటు టాటా మోటార్స్ కూడా పాత జ్ఞాపకాలను నెమరువేస్తూ టాటా సియెర్రా ఈవీని రంగంలోకి దించుతోంది.
కేవలం ఇవే కాకుండా, ఈ ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కూడా పెద్ద ఎత్తున మార్పులు జరగబోతున్నాయి. వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ సంస్థ తన 7-సీటర్ ఎంపీవీ, ఇతర మోడళ్లతో ఇండియాలో అడుగుపెడుతోంది. గతేడాది ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 4.49 మిలియన్ల రికార్డు స్థాయిని తాకడంతో, అదే ఊపును కొనసాగించాలని కంపెనీలు భావిస్తున్నాయి. ముఖ్యంగా 2025 డిసెంబర్‌లో జీఎస్టీ తగ్గింపు ప్రకటన తర్వాత కార్ల అమ్మకాలు 26.8 శాతం పెరగడం కంపెనీలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
హ్యుందాయ్, ఎంజీ మోటార్, నిస్సాన్, స్కోడా, వోక్స్‌వ్యాగన్ వంటి సంస్థలు కూడా తమ సరికొత్త మోడళ్లను ఈ ఏడాది వరుసగా లాంచ్ చేయనున్నాయి. టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ అవిన్యా సిరీస్‌ను 2026 చివరలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. మహీంద్రా నుంచి కూడా BE.07, థార్ ఎలక్ట్రిక్ వంటి మోడళ్లు రావచ్చని సమాచారం. హై-టెక్ ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ, పర్యావరణ హితమైన ఇంజన్లతో రాబోతున్న ఈ కార్లు కస్టమర్లకు ఎంపికలో సరికొత్త సవాళ్లను విసరనున్నాయి.