Renault Duster : క్రెటాకు షాక్ ఇవ్వడానికి రెనాల్ట్ సిద్ధం..2026లో సరికొత్త డిజైన్ తో రీఎంట్రీ ఇస్తున్న డస్టర్.
Renault Duster : భారతీయ మార్కెట్‌లో ఒకప్పుడు మంచి ఆదరణ పొందిన మిడ్-సైజ్ ఎస్‌యూవీ రెనాల్ట్ డస్టర్ తిరిగి రావడానికి సిద్ధమవుతోంది. ఇది మొదట 2012లో విడుదలైంది. అయితే అమ్మకాలు తగ్గడం, సరైన సమయంలో అప్‌డేట్‌లు లేకపోవడం కారణంగా 2022 ప్రారంభంలో దీని ఉత్పత్తి నిలిపివేయబడింది. ఇప్పుడు ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెండవ జనరేషన్ మోడల్‌ను పూర్తిగా దాటవేసి, సరికొత్త డిజైన్, మెరుగైన ఫీచర్లు, కొత్త ఇంజిన్‌లతో మూడవ జనరేషన్ మోడల్‌ను తీసుకురాబోతోంది. కొత్త 2026 రెనాల్ట్ డస్టర్ జనవరి 26న ప్రపంచానికి పరిచయం కానుంది. ఆ వెంటనే భారత మార్కెట్‌లో విడుదల కానుంది.
రాబోయే 2026 రెనాల్ట్ డస్టర్ మునుపటి మోడల్ కంటే మరింత ధృఢంగా, స్పోర్టీ లుక్‌లో కనిపిస్తుంది. ఇది మాడ్యులర్ CMF-B ప్లాట్‌ఫారమ్ పై ఆధారపడి ఉంటుంది. డాసియా డస్టర్ తరహాలోనే భారతదేశంలో విడుదలయ్యే రెనాల్ట్ డస్టర్‌లో రెనాల్ట్ కొత్త లోగోతో కూడిన సరికొత్త డిజైన్ ఫ్రంట్ గ్రిల్, ఆకర్షణీయమైన LED హెడ్‌లైట్లు, బంపర్‌పై భారీ క్లాడింగ్, విశాలమైన ఎయిర్ డ్యామ్‌లు, గుండ్రటి ఫాగ్ ల్యాంప్‌లు ఉండే అవకాశం ఉంది. ఇతర డిజైన్ ఫీచర్లలో డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, శక్తివంతమైన ఫ్రంట్, రియర్ ఫెండర్లు, వీల్ ఆర్చ్‌లపై క్లాడింగ్, ఫంక్షనల్ రూఫ్ రెయిల్స్, సి-షేప్ LED టెయిల్ ల్యాంప్‌లు, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్ వంటివి ఉన్నాయి.
కొత్త 2026 రెనాల్ట్ డస్టర్‌ను ఆల్-బ్లాక్ లేదా డ్యూయల్-టోన్ కేబిన్ థీమ్ ఆప్షన్‌లలో అందించే అవకాశం ఉంది. లోపలి భాగంలో ఇది ప్రీమియం ఫీచర్లతో నిండి ఉంటుంది. వీటిలో 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, అర్కామిస్ 3డి సౌండ్ సిస్టమ్, 360 డిగ్రీల కెమెరా, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) టెక్నాలజీ వంటివి ఉండవచ్చు. ఈ ఫీచర్లు ముఖ్యంగా హ్యుందాయ్ క్రిటా వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి దోహదపడతాయి.
భారతదేశంలో కొత్త 2026 రెనాల్ట్ డస్టర్ కేవలం పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌తో మాత్రమే అందుబాటులోకి వస్తుంది. ఈ కొత్త మోడల్‌లో 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 156 బీహెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో 6-స్పీడ్ మాన్యువల్, CVT ఆటోమేటిక్ యూనిట్ ఉండే అవకాశం ఉంది. ఈ శక్తివంతమైన టర్బో పెట్రోల్ ఇంజిన్ ఈ ఎస్‌యూవీకి మెరుగైన పర్ఫార్మెన్స్‌ను ఇస్తుంది.