Ather Energy : కొత్త ఏడాది కస్టమర్లకు షాక్.. జనవరి 1 నుంచి పెరగనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు.

Update: 2025-12-26 16:00 GMT

Ather Energy : కొత్త ఏడాది వేళ ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు షాకిచ్చే వార్త ఇది. ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తన స్కూటర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు వచ్చే ఏడాది జనవరి 1, 2026 నుంచే అమలులోకి రానున్నాయి. ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ ఐక్యూబ్ వంటి దిగ్గజాలతో పోటీ పడుతున్న ఏథర్.. ముడి సరుకుల ధరల పెరుగుదల, గ్లోబల్ సప్లై చైన్ సమస్యల కారణం చూపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. మీరు గనుక కొత్తగా ఏథర్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ నెలాఖరులోపు బుక్ చేసుకోవడమే లాభదాయకం.

ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం తన స్కూటర్ల ధరలను గరిష్టంగా రూ.3,000 వరకు పెంచుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో కరెన్సీ రేట్ల హెచ్చుతగ్గులు, విదేశీ విడిభాగాల దిగుమతి ఖర్చులు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది. ఏథర్ నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన రిజ్టా ఫ్యామిలీ స్కూటర్లతో పాటు పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే 450 సిరీస్ మోడల్స్ అన్నీ ఇప్పుడు ఖరీదు కానున్నాయి. అంటే 2026 నుంచి మీరు ఏథర్ స్కూటర్ కొనాలంటే జేబు నుంచి మరికొంత అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ముఖ్యంగా ఫ్యామిలీ కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఏథర్ రిజ్టా వేరియంట్ల విషయానికి వస్తే.. ప్రస్తుతం రూ.1,14,546 గా ఉన్న రిజ్టా ఎస్ ధర జనవరి నుంచి రూ.1,17,546 కి చేరుతుంది. అలాగే హై-ఎండ్ వేరియంట్ రిజ్టా జెడ్ ధర రూ.1,34,047 నుంచి రూ.1,37,047 కి పెరగనుంది. కంపెనీ తన క్వాలిటీ, సర్వీస్ ప్రమాణాలను కాపాడుకోవడానికే ఈ స్వల్ప పెంపు అనివార్యమైందని స్పష్టం చేసింది.

కేవలం రిజ్టా మాత్రమే కాదు, స్పోర్టీ లుక్ తో ఉండే 450 సిరీస్ ధరలు కూడా భారీగానే మారుతున్నాయి. ఏథర్ 450S ధర రూ.1.25 లక్షల మార్కును దాటనుండగా, ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన ఏథర్ 450 ఎపెక్స్ ధర ఏకంగా రూ.1.85 లక్షల పైచిలుకు చేరుకోనుంది. ఏథర్ స్కూటర్లు వాటి బ్యాటరీ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, బిల్డ్ క్వాలిటీకి పెట్టింది పేరు. ఓలా వంటి కంపెనీలు భారీ డిస్కౌంట్లతో మార్కెట్ ను ఆక్రమిస్తున్న వేళ, ఏథర్ ధరలను పెంచడం చర్చనీయాంశంగా మారింది. అయితే, క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే ఈ పెంపు ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. డిసెంబర్ 31 లోపు బుక్ చేసుకున్న వారికి పాత ధరలే వర్తిస్తాయి కాబట్టి, కొనుగోలుదారులు త్వరపడటం మంచిది.

Tags:    

Similar News