Budget 2026 : సామాన్యుడికి బంపర్ ఆఫర్? 80C లిమిట్ డబుల్..పన్ను ఆదాతో మధ్యతరగతికి పండగే.
Budget 2026 : ప్రతి ఏటా బడ్జెట్ వస్తుందంటే చాలు.. సామాన్యుడు ఆశగా ఎదురుచూసేది ఒక్కటే.. "ఈసారైనా ఆదాయపు పన్ను తగ్గుతుందా?" అని. రాబోయే బడ్జెట్ 2026 పై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. గత పదేళ్లుగా మారకుండా ఉన్న పన్ను మినహాయింపు పరిమితులను పెంచాలని మధ్యతరగతి ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా సెక్షన్ 80C పరిమితి పెంచడం ద్వారా తమ చేతిలో నాలుగు పైసలు మిగులుతాయని ట్యాక్స్ పేయర్లు ఆశపడుతున్నారు.
ఆదాయపు పన్నులో అందరికీ బాగా తెలిసిన సెక్షన్ 80C. పీపీఎఫ్, ఎల్ఐసీ, పిల్లల ట్యూషన్ ఫీజులు వంటి పొదుపు మొత్తాలపై ప్రస్తుతం ఏడాదికి 1.5 లక్షల వరకు మినహాయింపు లభిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ లిమిట్ 2014 నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా పెరగలేదు. ఈ పదేళ్లలో ద్రవ్యోల్బణం, ఖర్చులు, జీతాలు విపరీతంగా పెరిగినా.. పొదుపుపై మినహాయింపు మాత్రం అక్కడే ఆగిపోయింది. అందుకే ఈసారి ఈ పరిమితిని 3 లక్షలకు పెంచాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. దీనివల్ల ప్రజల్లో పొదుపు అలవాటు పెరగడమే కాకుండా, ట్యాక్స్ భారం కూడా తగ్గుతుంది.
ఇల్లు కొనడం ప్రతి భారతీయుడి కల. కానీ ప్రస్తుతం ప్రాపర్టీ రేట్లు, హోమ్ లోన్ వడ్డీ రేట్లు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ప్రస్తుతం హోమ్ లోన్ వడ్డీపై ఏడాదికి 2 లక్షల వరకు మాత్రమే ట్యాక్స్ మినహాయింపు ఉంది. పెరిగిన ఈఎంఐల దృష్ట్యా ఈ మొత్తం ఏ మూలకు సరిపోవడం లేదని ట్యాక్స్ పేయర్లు వాపోతున్నారు. ఈ పరిమితిని 3 లక్షలకు పెంచాలని, అలాగే ఈ సౌకర్యాన్ని కొత్త పన్ను విధానంలో కూడా ప్రవేశపెట్టాలని డిమాండ్ వస్తోంది. ఇదే జరిగితే రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపు రావడంతో పాటు ఇల్లు కొనేవారికి పెద్ద ఊరట లభిస్తుంది.
కరోనా తర్వాత వైద్య ఖర్చులు ఆకాశాన్ని అంటాయి. సెక్షన్ 80D కింద హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ఇచ్చే మినహాయింపు (ప్రస్తుతం 25 వేలు, సీనియర్ సిటిజన్లకు 50 వేలు) ఏమాత్రం సరిపోవడం లేదు. ఆసుపత్రి బిల్లులు లక్షల్లో ఉంటున్న తరుణంలో ఈ పరిమితిని కూడా సవరించాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు రిటైర్మెంట్ కోసం చేసే నేషనల్ పెన్షన్ స్కీమ్ అదనపు మినహాయింపును 50 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచితే వృద్ధాప్యంలో ప్రజలకు భరోసా లభిస్తుంది. మరి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌లో మధ్యతరగతి మనుసు గెలుస్తారో లేదో చూడాలి.