BUSINESS: నేటి నుంచే అమల్లోకి కీలక మార్పులు
కొత్త ఏడాదిన అమల్లోకి మార్పులు... సామాన్యుడి జీవితంపైనా ప్రభావం... రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పు
2025లో సామాన్యులపై ప్రభావం చూపే ఆర్థిక విషయాల్లో చాలా మార్పులొచ్చాయి. 2026లో కూడా కొన్ని మార్పులు రానున్నాయి. సామాన్యుల నిత్యజీవితంపై ప్రభావం చూపే మార్పులు రాబోతున్నాయి. నేటి నుంచి క్రెడిట్ రిపోర్ట్ మరింత వేగంగా అప్డేట్ కానుంది. ఇప్పటివరకూ 15 రోజులకు ఒకసారి క్రెడిట్ స్కోర్ అప్డేట్ అవుతుండగా.. ఇకపై బ్యాంకులు వారానికి ఒకసారి బ్యూరోలకు నివేదించాల్సి ఉంది. జనవరి 1 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. ఫలితంగా బ్యాంకు లోన్లకు ఎలిజిబులిటీ, క్రెడిట్ హిస్టరీ ఎప్పటికప్పుడే క్రెడిట స్కోరులో అప్డేట్ కానున్నాయి.
క్రెడిట్ స్కోరు
క్రెడిట్ స్కోర్‌కు సంబంధించి ఇకపై బ్యాంకులు వారానికోసారి బ్యూరోలకు నివేదించాలి. జనవరి 1 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. 8వ వేతన కమిషన్ జనవరి 1 నుంచి ప్రారంభం కానుంది. ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీ ద్వారా పాన్ కార్డు తీసుకున్నవారు డిసెంబరు 31లోగా పాన్-ఆధార్ అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే జనవరి 1 నుంచి పాన్ కార్డు రద్దయి, కార్డు నిలిచిపోతుంది. రైళ్లకు సంబంధించి కొత్త టైం టేబుల్ జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. న్యూ ఇయర్లో రైళ్ల రాకపోకల సమయాలు కూడా మారనున్నాయి. కొత్త టైమ్ టేబుల్ జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వందేభారత్ ఎక్స ప్రెస్ లతో పాటు మొత్తం 25 రైళ్ల సమయాలు మారనున్నాయి. సికింద్రాబాద్ - విశాఖపట్నం (20707) వందేభారత్ ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి 5.05 గంటలకు బయల్దేరుతుండగా..జనవరి 1 నుంచి 5 గంటలకే బయల్దేరనుంది.
సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ (12757) ఉదయం 8.20కి బదులుగా 8.10 గంటలకు, సికింద్రాబాద్ - భద్రాచలం (17659) కాకతీయ ఎక్స్ ప్రెస్ 5.25కి బదులుగా 5 గంటలకు బయల్దేరనున్నాయి. అలాగే ఆధార్ అథంటికేటెడ్ రిజర్వేషన్లు.. తొలి 15 నిమిషాల వరకే ఉండగా.. డిసెంబర్ 29 నుంచి ఈ సమయంలో 4 గంటలకు పెరిగింది. అంటే.. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకూ ఆథార్ అథంటికేటెడ్ అకౌంట్లు ఉన్నవారు మాత్రమే టికెట్లను రిజర్వేషన్ చేసుకోగలరు. జనవరి 5 నుంచి ఈ సమయం సాయంత్రం 4 గంటల వరకు, 12వ తేదీ నుంచి రాత్రి 12 గంటల వరకూ పంచనుంది.
వేతన కమిషన్
2025 డిసెంబర్ 31తో 7వ వేతన కమిషన్ గడువు ముగియనుంది. జనవరి 1 నుంచి 8వ వేతన కమిషన్ ప్రారంభం కానుంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోయినా.. వేతన పెంపు నిర్ణయాలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఊరట లభించనుంది. జనవరి 1 నుంచి కార్లు, బైకుల ధరలు పెరగనున్నాయి. బెంజ్, బీఎండబ్ల్యూ, నిస్సాన్, రెనో, జేఎస్ డబ్ల్యూ, ఎంజీ మోటార్, బీవైడీ కంపెనీలు కారల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. బైక్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ కూడా స్కూటర్లపై రూ.3 వేలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇక ఎల్పీజీ, కమర్షియల్ గ్యాస్, ఏటీఎఫ్ ధరలను ప్రతీ నెల 1న చమురు కంపెనీలు సవరిస్తాయన్న విషయం తెలిసిందే. కొత్త సంవత్సరంలో కమర్షియల్ సిలిండర్ ధర తగ్గే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 2026లో మరిన్ని కీలక మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.