Renault Duster : రీఎంట్రీ ఇస్తున్న రెనాల్ట్ డస్టర్.. పాత మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

Update: 2025-11-11 11:06 GMT

Renault Duster : ఐదేళ్ల విరామం తర్వాత రెనాల్ట్ డస్టర్ తిరిగి భారతీయ మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. కొత్త రెనాల్ట్ డస్టర్ 2026లో లాంచ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. గతంలో మొదటి తరం డస్టర్ తన స్ట్రాంగ్ డిజైన్, అద్భుతమైన పనితీరుతో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఒక బెంచ్‌మార్క్‌ను సృష్టించింది. కానీ, పెరుగుతున్న పోటీ కారణంగా కంపెనీ దాని ఉత్పత్తిని నిలిపివేసింది. ఇప్పుడు మార్కెట్ చాలా వేగంగా మారిన నేపథ్యంలో కొత్త డస్టర్ పాత సక్సెస్ రిపీట్ చేయగలదా ? డస్టర్‌కు ఉన్న అవకాశాలు, సవాళ్లు ఏమిటో తెలుసుకుందాం.

రెనాల్ట్ డస్టర్ తిరిగి భారత మార్కెట్‌లోకి రావడం కంపెనీకి ఒక గ్రాండ్ రీ-ఎంట్రీ వంటిది. అయితే ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు డస్టర్‌కు సవాలు విసురుతున్నాయి. పాత రెనాల్ట్ డస్టర్ దాని స్ట్రాంగ్ బాడీ, అద్భుతమైన ఆఫ్-రోడ్ పర్ఫామెన్స్ కోసం ఇప్పటికీ చాలా మందికి గుర్తుంది. సెకండ్-హ్యాండ్ మార్కెట్‌లో దీనికి ఇంకా మంచి డిమాండ్ ఉంది. గత ఐదేళ్లలో భారతీయ ఎస్‌యూవీ మార్కెట్ పూర్తిగా మారిపోయింది. కొత్త మోడళ్లు, అడ్వాన్సుడ్ టెక్నాలజీలు వినియోగదారుల ప్రాధాన్యతలు మారడంతో కొత్త డస్టర్‌కు ఇప్పుడు గట్టి పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది.

కొత్త డస్టర్ పాత విజయాన్ని రిపీట్ చేయడానికి అవకాశం ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. డస్టర్ ఇప్పటికే కలిగి ఉన్న స్ట్రాంగ్ బ్రాండ్ గుర్తింపు కొత్త మోడల్‌కు లాంచ్ అయిన వెంటనే మంచి మైలేజ్ ఇస్తుంది. కొత్త డస్టర్ మరింత స్టైలిష్, ప్రీమియం డిజైన్‌తో రానుంది. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉంటాయి. అలాగే, LED హెడ్‌ల్యాంప్‌లు, LED DRLs దీని రూపాన్ని ఆకర్షణీయంగా మారుస్తాయి.

కొత్త డస్టర్‌లో టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు మైల్డ్-హైబ్రిడ్, హైబ్రిడ్ పెట్రోల్ వేరియంట్‌లు కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇది పాత మోడల్ కంటే మెరుగైన పనితీరు, మైలేజీని ఇస్తుంది. రెనాల్ట్ ఈ కొత్త డస్టర్‌ను భారతదేశంలోనే లోకల్‌గా తయారు చేయాలని నిర్ణయించింది. దీని వలన తయారీ ఖర్చు తగ్గి, ఎస్‌యూవీ ధరను మార్కెట్‌లోని ఇతర కార్లకు పోటీగా తక్కువగా ఉంచడానికి వీలవుతుంది.

పాత డస్టర్‌కు ఉన్నన్ని అనుకూలతలు ఇప్పుడు కొత్త డస్టర్‌కు లేవు. అందుకే కొన్ని సవాళ్లను ఎదుర్కోవాలి. భారతీయ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఇప్పటికే చాలా ప్రజాదరణ పొందిన మోడళ్లు (ఉదా. క్రెటా, సెల్టోస్, గ్రాండ్ విటారా) ఉన్నాయి. ఈ మార్కెట్‌లో డస్టర్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందడం కష్టం. పాత డస్టర్ లాంచ్ అయినప్పుడు, అది తన సెగ్మెంట్‌లో దాదాపుగా మొదటి ఎస్‌యూవీ. అందుకే దానికి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ లభించింది. కానీ ఇప్పుడు కొత్త డస్టర్ ఇప్పటికే మార్కెట్‌లో స్థిరపడిన కంపెనీలతో పోరాడవలసి ఉంటుంది.

Tags:    

Similar News