Elon Musk Twitter: ఎలాన్ మస్క్ ట్విట్టర్ డీల్‌లో కీలక మలుపు.. అప్పుడే కాదట..!
Elon Musk Twitter: ట్విటర్ కొనుగోలు ఒప్పందంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో ఆసక్తికరమైన ప్రకటన చేశారు.;
Elon Musk Twitter: ట్విటర్ కొనుగోలు ఒప్పందంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఒప్పందం ముందుకు వెళ్లే విషయంలో ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌కు ఓ అల్టిమేటం విధించారు. ట్విటర్లో నకిలీ ఖాతాల సంఖ్య.. సంస్థ వెల్లడించిన దానికంటే ఎక్కవే ఉంటాయని మస్క్ అభిప్రాయం. నకిలీ ఖాతాలు 5 శాతం కంటే తక్కువ ఉంటాయని ట్విట్టర్ సీఈవో వివరించగా.. దాదాపు 20 శాతం స్వామ్ ఖాతాలుంటాయని మస్క్ అంచనా వేశారు.
నకిలీ అకౌంట్ల సంఖ్య 5 శాతం కంటే తక్కువగా ఉన్నట్టు ఆధారాలు చూపించకపోతే 44 బిలియన్ డాలర్ల విలువైన డీల్ ముందుకు కదలదని ఎలాన్ మస్క్ తేల్చిచెప్పారు. ఆధారాలు చూపించేవరకు ఈ ఒప్పందం ముందుకు సాగదని ట్వీట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మస్క్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకునే యోచనలో ఉండొచ్చని వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇటీవల ట్విట్టర్ షేర్ భారీగా పడిపోవడం కూడా మస్క్ తక్కువ ధరకు కొనుగోలు చేయాలన్న అభిప్రాయానికి రావడానికి కారణమై ఉంటుందని చెబుతున్నారు. ట్విట్టర్ ఒక్కో షేర్‌ను 54.20 డాటర్ల చెల్లించి ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు ఏప్రిల్ 14న ఎలాన్ మస్క్ ఒప్పందం చేసుకున్నారు. కానీ నకిలీ ఖాతాల సంఖ్యపై స్పష్టత రాకపోవడంతో ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి షేర్ ధర పడిపోతూ వస్తోంది.
తాజాగా 8 శాతం నష్టంతో 37.39 డాలర్ల వద్ద స్థిరపడింది. టెస్లా అధినేత మస్క్‌కు చైనాతో ఉన్న సంబంధాలు ట్విట్టర్ డీల్‌కు అడ్డంకిగా మారే అవకాశం ఉందని వాణిజ్య వర్గాలు విశ్లేషిస్తున్నాయి. టెస్లా కార్లకు చైనాలో బాగా గిరాకీ ఉంది. గత ఏడాది ఈ విద్యుత్తు కార్ల విక్రయాల్లో సగానికి పైగా ఆదేశంలోనే అమ్ముడుపోయాయి. అనేక షరతుల మధ్య విదేశీ కంపెనీలను అనుమతించే చైనా.. ట్విట్టర్ విషయంలోనూ ఇదే పంథాను కొనసాగించే అవకాశం ఉంది.