Gig Workers : 10 నిమిషాల డెలివరీకి బ్రేక్ పడనుందా? గిగ్ వర్కర్ల సమ్మెతో క్విక్ కామర్స్ సంక్షోభం.

Update: 2026-01-08 08:15 GMT

Gig Workers : భారతదేశంలో మెరుపు వేగంతో విస్తరిస్తున్న క్విక్ కామర్స్(10 నిమిషాల డెలివరీ) వ్యాపారం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. కొత్త సంవత్సరం వేళ దేశవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది డెలివరీ ఏజెంట్లు మెరుపు సమ్మెకు దిగడం ఈ రంగంలోని లోపాలను ఎత్తిచూపింది. కేవలం వేతనాలు, బీమా వంటి సౌకర్యాలే కాకుండా, డెలివరీ భాగస్వాములు ప్రధానంగా 10 నిమిషాల డెలివరీ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అమెరికా వంటి దేశాల్లో ఇలాంటి వ్యాపార నమూనాలు విఫలమైనప్పటికీ, భారతదేశంలో బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి యాప్‌లు డార్క్ స్టోర్ల సంఖ్యను భారీగా పెంచుతూ 2030 నాటికి వీటిని 7,500కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ఈ వేగవంతమైన డెలివరీల కోసం ఏజెంట్లు ట్రాఫిక్, కాలుష్యంతో నిండిన రోడ్లపై ప్రాణాలకు తెగించి ప్రయాణించాల్సి వస్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

డెలివరీ ఏజెంట్ల సమ్మె, వారి భద్రతపై పెరుగుతున్న సామాజిక ఆందోళనలు ఇన్వెస్టర్లలో కూడా భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. అక్టోబర్ మధ్య నుంచి జొమాటో (బ్లింకిట్), స్విగ్గీ వంటి కంపెనీల షేర్లు మార్కెట్లో సుమారు 20 శాతం వరకు పతనమవ్వడం దీనికి నిదర్శనం. ఒకవేళ ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం కఠినమైన సామాజిక భద్రతా చట్టాలను తీసుకువచ్చినా లేదా 10 నిమిషాల డెలివరీపై ఆంక్షలు విధించినా, లాభాల బాట పట్టకముందే ఈ బిజినెస్ మోడల్ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వినియోగదారుల అతివేగపు అలవాటు, డెలివరీ రైడర్ల భద్రత మధ్య జరుగుతున్న ఈ పోరాటం ఇప్పుడు క్విక్ కామర్స్ కంపెనీలకు అతిపెద్ద సవాలుగా మారింది.

మరోవైపు, ఈ విమర్శలపై జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ స్పందిస్తూ.. 10 నిమిషాల నిబంధన డ్రైవర్లను ప్రమాదకర డ్రైవింగ్‌కు ప్రోత్సహించడం లేదని, తక్కువ దూర ప్రయాణాల వల్లే ఇది సాధ్యమవుతోందని వివరణ ఇచ్చారు. సగటున ఒక డెలివరీ భాగస్వామి నెలకు రూ.21,000 వరకు సంపాదించవచ్చని, ఇది ఒక అన్‌స్కిల్డ్ జాబ్ కు సరైన వేతనమేనని ఆయన వాదించారు. అయితే ఆయన గణాంకాల ప్రకారమే కేవలం 2.3 శాతం మంది మాత్రమే ఏడాదిలో 250 రోజులకు పైగా పని చేస్తున్నారన్న వాస్తవం బయటపడింది. అంటే భారతదేశంలో శ్రమశక్తి అధికంగా ఉండటం వల్ల అసంతృప్తితో ఒకరు వెళ్లిపోయినా మరొకరు సిద్ధంగా ఉంటున్నారని, ఈ విధానం వల్ల కంపెనీలకు డ్రైవర్ల కొరత రాకపోయినప్పటికీ, కార్మికుల ఆర్థిక స్థిరత్వం, వృత్తిపరమైన సంతృప్తి మాత్రం ప్రశ్నార్థకంగానే మిగిలిపోతోందని స్పష్టమవుతోంది.

Tags:    

Similar News