PF Withdrawal : పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..ఇక నుంచి ఏటీఎం ద్వారానే నగదు విత్‌డ్రా!

Update: 2026-01-01 05:45 GMT

PF Withdrawal : ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒక పెద్ద భరోసా. అయితే, అవసరానికి ఆ డబ్బు తీసుకోవాలంటే ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసి, రోజుల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. ఇకపై మీ పీఎఫ్ డబ్బును కూడా బ్యాంక్ ఏటీఎం నుంచి డ్రా చేసుకునే సౌకర్యం రాబోతోంది. 2026 నాటికి ఈ విప్లవాత్మక మార్పు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

సాధారణంగా మీ జీతంలో నుంచి కట్ అయ్యే పీఎఫ్ డబ్బులు మీ ఖాతాలోనే దాచబడి ఉంటాయి. వీటిని విత్‌డ్రా చేయడం కోసం ఇన్నాళ్లూ ఫారమ్‌లు నింపడం, ఆఫీసుల చుట్టూ తిరగడం లేదా ఆన్‌లైన్ క్లెయిమ్‌ల కోసం ఎదురుచూడటం జరిగేది. అయితే, ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఈపీఎఫ్ఓ కసరత్తు చేస్తోంది. మీరు మీ బ్యాంకు ఖాతా నుంచి డెబిట్ కార్డు ద్వారా డబ్బులు ఎలా డ్రా చేసుకుంటారో, అదే విధంగా పీఎఫ్ డబ్బును కూడా డ్రా చేసుకునేలా కొత్త సిస్టమ్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. దీని కోసం ఈపీఎఫ్ఓ ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర ప్రధాన బ్యాంకులతో ప్రాథమిక చర్చలు పూర్తి చేసింది.

ఈ కొత్త విధానంలో భాగంగా ఈపీఎఫ్ఓ తన సభ్యులకు ఒక స్పెషల్ కార్డును జారీ చేయాలని యోచిస్తోంది. ఇది మీ దగ్గర ఉండే సాధారణ డెబిట్ కార్డులాగే పనిచేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో అంటే ఆసుపత్రి ఖర్చులు, పెళ్లిళ్లు లేదా ఇతర ఆర్థిక ఇబ్బందుల సమయంలో ఈ కార్డును ఏటీఎం మిషన్లలో ఉపయోగించి పీఎఫ్ ఖాతా నుంచి నగదు తీసుకోవచ్చు. ఒక ఉద్యోగి సంపాదించుకున్న డబ్బును అవసరానికి వాడుకోవడానికి ఎందుకు ఇబ్బంది పడాలి అనే ఆలోచనతోనే ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన సాంకేతిక మౌలిక సదుపాయాలు దాదాపు సిద్ధమయ్యాయని నివేదికలు చెబుతున్నాయి.

ప్రస్తుతం ఈపీఎఫ్ఓ పరిధిలో సుమారు 7 కోట్ల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 2014లో పీఎఫ్ ఫండ్ విలువ 7.4 లక్షల కోట్లు ఉంటే, ఇప్పుడు అది ఏకంగా 28 లక్షల కోట్లకు పైగా పెరిగింది. ప్రతినెలా సుమారు 7.8 కోట్ల మంది తమ పీఎఫ్ వాటాను చెల్లిస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో ఉన్న క్లెయిమ్‌లను పరిష్కరించడం ఈపీఎఫ్ఓకు ఒక సవాలుగా మారింది. ఏటీఎం సౌకర్యం అందుబాటులోకి వస్తే, ఉద్యోగులకు తక్షణమే డబ్బు అందడమే కాకుండా, ఈపీఎఫ్ఓ ఆఫీసులపై పనిభారం కూడా గణనీయంగా తగ్గుతుంది.

ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు అని తెలిసినా, దీనిపై కొన్ని నిబంధనలు కూడా ఉండే అవకాశం ఉంది. ఒక రోజుకు లేదా ఒక నెలకు ఎంత మొత్తం డ్రా చేసుకోవచ్చు అనే దానిపై విత్‌డ్రా లిమిట్ నిర్ణయించే పనిలో అధికారులు ఉన్నారు. ఇప్పటికే ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచిన ఈపీఎఫ్ఓ, ఇప్పుడు ఏటీఎం సౌకర్యం ద్వారా సామాన్యులకు మరింత చేరువవ్వాలని చూస్తోంది. అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే ఈ నిబంధనలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News