బంగారం, వెండి ధరల్లో డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. అక్షయ తృతీయ నాడు బంగారు ఆభరణాలు కొనాలని ఆలోచిస్తున్న వారికి శుభవార్త. అంతర్జాతీయ సంకేతాల కారణంగా వరుసగా రెండో రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1450 తగ్గి రూ.72,150కి చేరుకుంది.
రానున్న రోజుల్లో బంగారం ధర రూ.70,000కు పడిపోయే అవకాశం ఉందని, అంతకంటే దిగువకు జారిపోతే మరింత పతనమయ్యే అవకాశం ఉందని కమోడిటీ రంగానికి సంబంధించిన నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల కనిపిస్తోంది. బంగారం ధర రెండు వారాల కనిష్ట స్థాయికి పడిపోయి ఔన్సు ధర 2298.59 డాలర్లకు చేరుకుంది. సోమవారం నాడు గత 22 నెలల్లో అత్యధికంగా 2.7 శాతం పతనం నమోదైంది. ఏప్రిల్ 12న బంగారం ఔన్స్‌కు 2431.29 డాలర్లకు చేరుకుంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తత సడలింపు సంకేతాల మధ్య బంగారానికి డిమాండ్ క్షీణించడం, US ఫెడరల్ రిజర్వ్ పాలసీ రేట్లను ఎక్కువ కాలం పాటు ఉంచడం వల్ల బంగారం ధరలు తగ్గాయి.