Venezuela Gold Price : టీ కప్పు ధరకే బంగారం..వెనిజులాలో వింత పరిస్థితి.
Venezuela Gold Price : వెనిజులాలో ఒక కప్పు టీ ధరకే తులం బంగారం దొరుకుతుందనే వార్తలు తరచుగా వింటూ ఉంటాం. కానీ ఈ వార్తల వెనుక ఉన్న అసలు నిజం వేరే ఉంది. ప్రస్తుతం ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణ సరిపోతుంది. వెనిజులాలో బంగారం నిజంగానే అంత చౌకగా దొరుకుతుందా? అసలు అక్కడ ఏం జరుగుతోంది? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. అక్కడ ఒకప్పుడు బంగారం నిక్షేపాలు సమృద్ధిగా ఉండేవి. కానీ, నేడు ఆ దేశ కరెన్సీ వెనిజులన్ బోలివర్ విలువ సున్నాకు పడిపోయింది. ఫలితంగా అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుంటే, స్థానిక కరెన్సీ లెక్క ప్రకారం బంగారం ధర చాలా తక్కువగా కనిపిస్తోంది.
భారతదేశంలో 2026 ప్రారంభంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,38,000 మార్కును దాటేసింది. కానీ వెనిజులాలో ఉన్న ద్రవ్యోల్బణం, కరెన్సీ పతనం వల్ల అక్కడ గ్రాము బంగారం భారత కరెన్సీలో కేవలం రూ.181.65 మాత్రమే పలుకుతోంది. అంటే మనం ఇక్కడ ఒక మంచి రెస్టారెంట్లో తాగే కాఫీ లేదా టీ ధరతో సమానం అన్నమాట. 22 క్యారెట్ల బంగారం ధర అయితే దాదాపు రూ.166 వద్దే ఉంది. అయితే, ఇది అక్కడ బంగారం చౌకగా దొరుకుతున్నట్టు కాదు, ఆ దేశ కరెన్సీ విలువ పూర్తిగా పడిపోయిందని చెప్పడానికి సంకేతం.
ప్రకృతి పరంగా వెనిజులా చాలా ధనిక దేశం. ప్రపంచంలోనే అత్యధిక ముడి చమురు నిక్షేపాలు (17%) ఈ దేశం దగ్గరే ఉన్నాయి. అంతేకాదు, భూగర్భంలో దాదాపు 8,000 టన్నుల బంగారం, వజ్రాలు, ఇతర ఖనిజాలు ఉన్నట్లు అంచనా. అయినప్పటికీ, రాజకీయ అస్థిరత, తప్పుడు ఆర్థిక విధానాల వల్ల ఆ దేశం దివాలా తీసింది. ప్రజలు ఒక పూట తిండి కోసం చేతిలో ఉన్న బంగారాన్ని కారు చౌకగా అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
ప్రభుత్వ నివేదికల ప్రకారం.. అధ్యక్షుడు నికోలస్ మదురో హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి వెనిజులా తన వద్ద ఉన్న బంగారు నిల్వలను రహస్యంగా విదేశాలకు పంపింది. 2013-2016 మధ్య కాలంలోనే దాదాపు 113 మెట్రిక్ టన్నుల బంగారాన్ని స్విట్జర్లాండ్‌కు తరలించినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆ దేశ అధికారిక బంగారు నిల్వలు కేవలం 161 టన్నులకు పడిపోయాయి. ఒకప్పుడు బంగారు గనులతో విరాజిల్లిన దేశం ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది.
2026 ప్రారంభంలో అమెరికా, వెనిజులా మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు అకస్మాత్తుగా పెరిగాయి. అమెరికా సైన్యం వెనిజులాపై కొన్ని ఆంక్షలు విధించడం లేదా అక్కడి రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల అంతర్జాతీయంగా బంగారం ధరలు 4% నుంచి 5% వరకు పెరిగాయి. ఈ పరిణామం వల్ల వెనిజులా ప్రజల కష్టాలు మరిన్ని పెరిగాయని చెప్పవచ్చు. ప్రకృతి ప్రసాదించిన నిధిని సరైన పద్ధతిలో వాడుకోకపోతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో చెప్పడానికి వెనిజులా ఒక ఉదాహరణ.