Gold Price : ట్రంప్ నిర్ణయాలతో పసిడి పరుగు..చరిత్రలో తొలిసారి 5000 డాలర్ల మార్కు దాటిన బంగారం.

Update: 2026-01-26 14:15 GMT

Gold Price : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ఒక విధమైన ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యంగా గ్రీన్‌ల్యాండ్‌పై నియంత్రణ సాధించాలనే ట్రంప్ ప్రకటనలు, ఐరోపా దేశాలపై పన్నుల విధింపు హెచ్చరికలు ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెరలేపాయి. దీని ప్రభావంతో అమెరికా డాలర్ విలువ పడిపోగా, మదుపర్లు తమ పెట్టుబడుల భద్రత కోసం బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఆదివారం ట్రేడింగ్‌లో బంగారం ధర తొలిసారిగా ఔన్సుకి 5,000 డాలర్ల మైలురాయిని దాటి, 5,026 డాలర్ల వద్ద ఆల్-టైమ్ రికార్డును సృష్టించింది. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి కూడా 102 డాలర్ల మార్కును దాటి పసిడి బాటలోనే పయనిస్తోంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. ఉక్రెయిన్, గాజా యుద్ధాలతో పాటు వెనిజులాలో అమెరికా జోక్యం వంటి అంశాలు ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచాయి. దీనికి తోడు అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్‌పై ట్రంప్ ఒత్తిడి తీసుకురావడం, బ్యాంకు చైర్మన్ జెరోమ్ పావెల్‌కు లీగల్ నోటీసులు అందడం వంటి పరిణామాలు బ్యాంకింగ్ వ్యవస్థ స్వతంత్రతపై అనుమానాలు రేకెత్తించాయి. ఇటువంటి అనిశ్చిత సమయాల్లో కరెన్సీ కంటే బంగారమే మేలని సెంట్రల్ బ్యాంకులు సైతం భారీగా పసిడిని నిల్వ చేస్తున్నాయి. 2024 ప్రారంభంలో 2,000 డాలర్ల వద్ద ఉన్న బంగారం ధర, రెండేళ్లలోనే రెండున్నర రెట్లు పెరగడం గమనార్హం.

మరోవైపు డెన్మార్క్ ప్రధాని మెటె ఫెడరిక్సెన్ గ్రీన్‌ల్యాండ్ పర్యటనకు వెళ్లడం, అక్కడి నాయకులతో చర్చలు జరపడం వంటివి అమెరికాతో దౌత్యపరమైన చిక్కులను పెంచుతున్నాయి. వాణిజ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉండటంతో మార్కెట్లు అల్లకల్లోలంగా మారాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం, గత ఏడాదితో పోలిస్తే బంగారం డిమాండ్ విలువ పరంగా 44 శాతం పెరిగి 146 బిలియన్ డాలర్లకు చేరింది. రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రమే కాకుండా, గోల్డ్ ఈటీఎఫ్‎ల ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈ వారంలో జరగబోయే ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయాల సమావేశం తర్వాత బంగారం ధరలు మరిన్ని రికార్డులను సృష్టిస్తాయో లేదో అని విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Tags:    

Similar News