Gold Rate : పసిడి పంజా..వెండి గర్జన..ఒక్కరోజే బంగారంపై రూ.7,300, వెండిపై రూ.40,500 జంప్.

Update: 2026-01-28 07:15 GMT

Gold Rate : బంగారం, వెండి ధరలు ఇప్పుడు సామాన్యుడి ఊహకు కూడా అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు వేల రూపాయల పెరుగుదల కనిపిస్తోంది. ఉదయం మార్కెట్ మొదలైనప్పుడు పెరిగిన ధరల కంటే, సాయంత్రం ఢిల్లీ బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి నమోదైన ధరలు చూసి ఇన్వెస్టర్లు సైతం నోరెళ్లబెడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధ మేఘాలు ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.

మంగళవారం బులియన్ మార్కెట్ చరిత్రలోనే ఒక అత్యంత కీలకమైన రోజుగా నిలిచిపోయింది. ఉదయం ఎంసీఎక్స్ మార్కెట్లో వెండి ధర రూ.30,000 పెరగడంతో అందరూ షాక్ తిన్నారు. కానీ సాయంత్రానికి ఢిల్లీ సర్రాఫా మార్కెట్లో వెండి ధర ఏకంగా రూ.40,500 పెరిగి కిలో వెండి ధర రూ.3,70,000 కు చేరుకుంది. కేవలం ఒక్క రోజులో 12.3 శాతం పెరుగుదల నమోదు చేయడం వెండి చరిత్రలో ఇదే తొలిసారి. పారిశ్రామిక అవసరాలు, సురక్షిత పెట్టుబడి సాధనంగా వెండికి డిమాండ్ పెరగడమే ఇందుకు కారణం.

బంగారం కూడా ఏమాత్రం తగ్గడం లేదు. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.7,300 పెరిగి రూ.1,66,000 మార్కును తాకింది. ఇది ఆల్ టైమ్ హై రికార్డ్. గత వారం ముగిసే సమయానికి రూ.1,58,700 గా ఉన్న ధర, సోమవారం గణతంత్ర దినోత్సవం సెలవు తర్వాత ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసింది. ఇదే వేగంతో పెరిగితే జనవరి నెలాఖరు నాటికి బంగారం రూ.2 లక్షల మార్కును చేరుకోవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అంతర్జాతీయంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య విధానాలు మార్కెట్లను వణికిస్తున్నాయి. కెనడా తర్వాత ఇప్పుడు దక్షిణ కొరియా నుంచి వచ్చే వస్తువులపై 25 శాతం టారిఫ్ విధిస్తానని ఆయన చేసిన ప్రకటన ప్రపంచ దేశాల్లో ఆందోళన కలిగించింది. దీనివల్ల డాలర్ విలువలో అస్థిరత ఏర్పడి, ఇన్వెస్టర్లంతా సేఫ్ హెవెన్‎గా భావించే బంగారం, వెండి వైపు మళ్ళుతున్నారు. అస్థిర పరిస్థితులు ఉన్నప్పుడు పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ కంటే బంగారాన్నే నమ్ముతారు.

అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు సరికొత్త గరిష్టాలను చేరుకున్నాయి. స్పాట్ గోల్డ్ ధర మొదటిసారిగా 5,000 డాలర్ల మనస్తత్వ స్థాయిని దాటి 5,110 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి కూడా అంతర్జాతీయంగా 112 డాలర్ల పైనే ఉంది. పారిశ్రామికంగా వెండికి ఉన్న భారీ డిమాండ్ కూడా ఈ పెరుగుదలకు తోడైంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుతానికి ధరలు తగ్గే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. రాబోయే రెండు మూడు రోజుల్లో వెండి రూ.4 లక్షల మార్కును దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సామాన్యులకు మాత్రం పెళ్లిళ్ల సీజన్లో ఈ ధరల పెరుగుదల గుండెలో రైళ్లు పరిగెత్తిస్తోంది.

Tags:    

Similar News