HDFC : హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ బంపర్ ఆఫర్..లోన్ ఉన్నవారికి కొత్త ఏడాది అదిరిపోయే గిఫ్ట్.

Update: 2026-01-09 06:00 GMT

HDFC : కొత్త ఏడాది వేళ దేశీ దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి తన ఖాతాదారులకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. లోన్ తీసుకున్న వారికి, కొత్తగా తీసుకోవాలనుకునే వారికి ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ పై వడ్డీ భారం తగ్గి, సామాన్యుల ఈఎంఐలు తగ్గనున్నాయి. ఈ మార్పులు ఇప్పటికే జనవరి 7, 2026 నుంచి అమలులోకి వచ్చాయి.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన ఎంపిక చేసిన లోన్ కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్ రేట్లను 5 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. దీనివల్ల బ్యాంక్ నుంచి రుణాలు పొందిన లక్షలాది మందికి ప్రయోజనం కలగనుంది. తాజా సవరణ తర్వాత.. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేట్లు ఇప్పుడు 8.25 శాతం నుంచి 8.55 శాతం మధ్య ఉన్నాయి. గతంలో ఇవి కొంచెం ఎక్కువగా ఉండేవి.

బ్యాంక్ ఓవర్‌నైట్, ఒక నెల కాలపరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్ రేట్లను 8.30 శాతం నుండి 8.25 శాతానికి తగ్గించింది. అలాగే, మూడు నెలల కాలపరిమితి గల రేటు 8.35 శాతం నుంచి 8.30 శాతానికి దిగివచ్చింది. అత్యంత కీలకమైన ఒక ఏడాది కాలపరిమితి గల ఎంసీఎల్ఆర్ (చాలా వరకు పర్సనల్, కార్ లోన్లు దీనిపై ఆధారపడి ఉంటాయి) 8.45 శాతం నుంచి 8.40 శాతానికి తగ్గింది. అయితే, రెండు ఏళ్లు, మూడేళ్ల కాలపరిమితి కలిగిన రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. యథాతథంగా 8.55 శాతంగానే కొనసాగనుంది. ఈ తాజా వడ్డీ రేట్ల మార్పులు ముఖ్యంగా స్వల్పకాలిక రుణాలు తీసుకునే వారికి కొంత ఊరటనిచ్చేలా ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక రుణాలపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపడం లేదు.

ఎంసీఎల్ఆర్ (MCLR) అంటే ఏమిటి?

చాలామందికి ఎంసీఎల్ఆర్ అంటే ఏంటో తెలియదు. సింపుల్‌గా చెప్పాలంటే, బ్యాంక్ తన కస్టమర్లకు ఇచ్చే రుణాలపై వసూలు చేయాల్సిన కనీస వడ్డీ రేటును ఎంసీఎల్ఆర్ అంటారు. దీనికంటే తక్కువ వడ్డీకి బ్యాంకులు అప్పులు ఇవ్వకూడదు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, బ్యాంకులు తమ నిధుల సమీకరణ వ్యయాన్ని బట్టి ఈ రేట్లను ఎప్పటికప్పుడు సవరిస్తుంటాయి. ఎంసీఎల్ఆర్ తగ్గితే సహజంగానే బ్యాంక్ ఇచ్చే కొత్త రుణాలు మరియు ఎంసీఎల్ఆర్ ఆధారిత పాత రుణాల వడ్డీ రేట్లు తగ్గుతాయి.

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి?

ఒకవైపు రుణగ్రహీతలకు ఊరటనిస్తూనే, మరోవైపు డిపాజిటర్లకు కూడా బ్యాంక్ మంచి లాభాలను అందిస్తోంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రస్తుతం సాధారణ పౌరులకు 2.75 శాతం నుంచి 6.45 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం నుంచి 6.95 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. 18 నెలల నుంచి 3 ఏళ్లలోపు కాలపరిమితి గల ఎఫ్‌డీలపై గరిష్టంగా 6.95 శాతం వడ్డీ లభిస్తోంది. ఇది పొదుపు చేసేవారికి మంచి అవకాశమని చెప్పవచ్చు.

Tags:    

Similar News