Holi 2026 Trade : హోలీ వేళ వ్యాపారులకు కాసుల వర్షం.. ఏకంగా రూ. 80 వేల కోట్ల టర్నోవర్!
Holi 2026 Trade : రంగుల పండుగ హోలీ ఈసారి దేశవ్యాప్తంగా వ్యాపారులకు కాసుల వర్షం కురిపించనుంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం..ఈ ఏడాది హోలీ సీజన్‌లో ఏకంగా రూ.80,000 కోట్ల భారీ వ్యాపారం జరిగే అవకాశం ఉంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ లెక్కల ప్రకారం.. గత ఏడాది జరిగిన రూ.60 వేల కోట్ల వ్యాపారంతో పోలిస్తే, ఈసారి సుమారు 25 శాతం వృద్ధి కనిపిస్తోంది. ప్రజల్లో ఉత్సాహం, పెరిగిన కొనుగోలు శక్తి మార్కెట్‌కు కొత్త కళను తీసుకొచ్చాయి. ఒకప్పుడు హోలీ అంటే చైనా పిచకారీలు, రంగులే రాజ్యమేలేవి. కానీ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన వోకల్ ఫర్ లోకల్ ప్రభావంతో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2021 తర్వాత మార్కెట్‌లో చైనా వస్తువుల ఆధిపత్యం దాదాపు కనుమరుగైంది. ఇప్పుడు ఎక్కడ చూసినా మన దేశీ తయారీ వస్తువులే కనిపిస్తున్నాయి. భారతీయ కళాకారులు తయారు చేసిన మట్టి పిచకారీలు, సహజ రంగులు, హ్యాండ్ మేడ్ వస్తువులకు విపరీతమైన గిరాకీ పెరిగింది. ఇది చిన్న తరహా పరిశ్రమలకు, స్థానిక వ్యాపారులకు పెద్ద ఆసరాగా నిలుస్తోంది.
ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో జనం ఇప్పుడు కెమికల్ రంగులకు దూరంగా ఉంటున్నారు. సహజమైన మూలికలతో తయారు చేసిన హెర్బల్ గులాల్, చందనం, సుగంధ రంగుల కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు పిల్లల కోసం స్పైడర్ మ్యాన్, ఛోటా భీమ్ వంటి కార్టూన్ క్యారెక్టర్ల పిచకారీలు సరికొత్తగా మార్కెట్లోకి వచ్చాయి. రంగులతో పాటు దుస్తుల వ్యాపారం కూడా పుంజుకుంది. హోలీ కోసం ప్రత్యేకంగా తెల్లటి టీ షర్టులు, కుర్తా పైజామాలు, హ్యాపీ హోలీ అని రాసి ఉన్న ప్రింటెడ్ డ్రెస్సుల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో వ్యాపార కార్యకలాపాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ సమాచారం ప్రకారం.. ఒక్క ఢిల్లీలోనే సుమారు రూ.15,000 కోట్ల టర్నోవర్ జరిగే అవకాశం ఉంది. ఇక హోలీ అంటే గుర్తొచ్చే గుజియా స్వీట్లకు డిమాండ్ ఆకాశాన్ని తాకుతోంది. స్వీట్ షాపులు, డ్రై ఫ్రూట్ ప్యాకెట్ల దగ్గర కస్టమర్ల క్యూలు కనిపిస్తున్నాయి. కిరాణా, పండ్లు, గిఫ్ట్ ఆర్టికల్స్ వ్యాపారులు కూడా ఈసారి లాభాల పండగ చేసుకుంటున్నారు.
హోలీ కేవలం రంగుల పండుగే కాదు, సామాజిక అనుబంధాలకు వేదిక. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో హోలీ మిలన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోనే సుమారు మూడు వేలకు పైగా ఈవెంట్స్ ప్లాన్ చేశారు. దీనివల్ల బ్యాంకెట్ హాళ్లు, ఫామ్ హౌస్‌లు, క్యాటరింగ్ సర్వీసులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. హోటళ్లు, రెస్టారెంట్లు అన్నీ ముందుగానే బుక్ అయిపోయాయి. ఈ ఏడాది మార్చి 3న హోలికా దహనం, మార్చి 4న రంగుల హోలీ జరగనున్న నేపథ్యంలో మార్కెట్లు ఇప్పటికే కిక్కిరిసిపోయాయి.