Hyundai Creta EV : 10 నిమిషాల ఛార్జింగ్‌తో 100 కిలోమీటర్లు..హ్యుందాయ్ క్రెటా ఈవీ నయా రికార్డ్.
Hyundai Creta EV : హ్యుందాయ్ కంపెనీ తన క్రెటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఛార్జింగ్ సామర్థ్యాన్ని భారీగా పెంచింది. ఇంతకుముందు కేవలం 50 kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మాత్రమే సపోర్ట్ చేసే ఈ కారు, ఇప్పుడు 100 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను పొందింది. ఈ అప్‌డేట్ వల్ల మునుపటితో పోలిస్తే ఛార్జింగ్ సమయం చాలా తగ్గింది. గతంలో 10 నుంచి 80 శాతం ఛార్జ్ అవ్వడానికి 58 నిమిషాలు పట్టేది, ఇప్పుడు కేవలం 39 నిమిషాల్లోనే పూర్తి అవుతుంది. విస్మయానికి గురిచేసే విషయం ఏమిటంటే.. ఈ మార్పు కోసం హ్యుందాయ్ హార్డ్‌వేర్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు, కేవలం OTA సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారానే ఈ అద్భుతం సాధ్యమైంది. పాత కస్టమర్లకు కూడా ఈ అప్‌డేట్ క్రమంగా అందుతుంది.
హ్యుందాయ్ క్రెటా ఈవీ రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లతో మార్కెట్లోకి వస్తోంది.
42 kWh బ్యాటరీ: ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 390 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది 133 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.
51.4 kWh బ్యాటరీ: ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 473 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇది 169 bhp పవర్‌ను జనరేట్ చేస్తుంది. ముఖ్యంగా 100 kW ఫాస్ట్ ఛార్జర్‌ను వాడితే, కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తోనే మీరు 100 కిలోమీటర్ల వరకు హాయిగా ప్రయాణించవచ్చు. సిటీలో తిరిగే వారికి, లాంగ్ జర్నీ చేసే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
డిజైన్, లుక్స్
చూడటానికి ఇది రెగ్యులర్ క్రెటా లాగే ఉన్నా, ఎలక్ట్రిక్ వెర్షన్ అని తెలియడానికి కొన్ని మార్పులు చేశారు. ముందు వైపు గ్రిల్ పూర్తిగా మూసివేయబడి ఉంటుంది. కొత్త బంపర్లు, 17 ఇంచుల ఎరో-స్టైల్ అల్లాయ్ వీల్స్ ఈ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. వెనుక వైపు కూడా కొత్త బంపర్ డిజైన్‌తో స్పోర్టీగా కనిపిస్తుంది. లోపలి భాగంలో రెండు 10.25 ఇంచుల స్క్రీన్లు (ఒకటి ఇన్ఫోటైన్మెంట్, మరొకటి డ్రైవర్ డిస్ప్లే) కారుకు ఆధునిక హంగులను అద్దాయి.
లగ్జరీ ఫీచర్లు
ఫీచర్ల విషయంలో హ్యుందాయ్ ఎక్కడా తగ్గలేదు. పనోరమిక్ సన్‌రూఫ్, 8-స్పీకర్ల బోస్ సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఇందులో V2L ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా కారు బ్యాటరీని పవర్ బ్యాంక్‌లా వాడుకుని లాప్‌టాప్‌లు, ఓవెన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను నడుపుకోవచ్చు. సిటీ ట్రాఫిక్‌లో డ్రైవింగ్‌ను సులభం చేయడానికి 'వన్ పెడల్ డ్రైవింగ్' మోడ్‌ను కూడా ప్రవేశపెట్టారు.
ధర ఎంత?
ధర విషయానికి వస్తే, క్రెటా ఈవీ 42 kWh వేరియంట్ ధర రూ.18.02 లక్షల నుంచి రూ.22.33 లక్షల మధ్యలో ఉంది. ఇక లాంగ్ రేంజ్ 51.4 kWh వేరియంట్ ధర రూ.20 లక్షల నుంచి రూ.23.96 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ ధరలతో ఇది టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీలకు బలమైన పోటీనిస్తోంది. తక్కువ సమయంలో ఛార్జింగ్ అయి, ఎక్కువ దూరం ప్రయాణించే కారు కావాలనుకునే వారికి క్రెటా ఈవీ ఇప్పుడు ది బెస్ట్ ఆప్షన్.