Alcohol Consumption : దేశంలో మందుబాబుల రాజధాని ఇదే..అక్కడ ప్రతి 10 మందిలో ఆరుగురు తాగుతున్నారు.

Update: 2025-12-04 05:45 GMT

Alcohol Consumption : ప్రభుత్వ ప్రయత్నాలు, సామాజిక అవగాహన కార్యక్రమాల కారణంగా జాతీయ స్థాయిలో పురుషులలో మద్యం సేవించే ధోరణి తగ్గినా (29.2% నుంచి 22.4%కి), కొన్ని రాష్ట్రాలలో మాత్రం ఈ వినియోగం విపరీతంగా పెరిగింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గణాంకాలు దేశంలో మద్యం వినియోగం గురించి ఆశ్చర్యకరమైన వివరాలను వెల్లడించాయి. ముఖ్యంగా గోవా తీరాల నుంచి బీహార్ వీధుల వరకు, మద్యం వినియోగం లెక్కలు భిన్నంగా ఉన్నాయి.

మద్యం వినియోగదారుల సంఖ్యలో గోవా రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. NFHS-5 లెక్కల ప్రకార.. గోవాలో మద్యం సేవించే పురుషుల సంఖ్య అత్యధికంగా 59.1% ఉంది. అంటే, గోవాలో ప్రతి 10 మంది పురుషులలో దాదాపు 6 మంది మద్యం సేవిస్తున్నారు. దీనికి వెంటనే అరుణాచల్ ప్రదేశ్ ఉంది.. ఇక్కడ 56.6% మంది పురుషులు తాగుతున్నారు. తెలంగాణ కూడా ఈ జాబితాలో పై స్థానాల్లో ఉంది. ఇక్కడ 50% పురుషులు మద్యం సేవిస్తున్నారు.

దేశంలో మద్యం వినియోగం అత్యంత తక్కువగా ఉన్న ప్రాంతం లక్షద్వీప్. ఇక్కడ కేవలం 0.2% మంది మాత్రమే మద్యం సేవిస్తారు. ఈ నివేదికలో అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే, డ్రై స్టేట్స్ అంటే మద్యపాన నిషేధం అమలులో ఉన్న రాష్ట్రాల పరిస్థితి. 2016 నుంచి పూర్తి మద్యపాన నిషేధం అమలులో ఉన్నప్పటికీ, బీహార్‌లో ఇప్పటికీ దాదాపు 17% (లేదా 15.5%) పురుషులు మద్యం సేవిస్తున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. అయితే, 2015-16 నాటి లెక్కలతో పోలిస్తే ఇది కొంత తగ్గింది.

గుజరాత్‌లో కూడా మద్యపాన నిషేధం ఉన్నా, ఇక్కడ ఆ సంఖ్య చాలా తక్కువగా (సుమారు 3.9%) ఉంది. నిషేధం ఉన్నా, వినియోగం పూర్తిగా ఆగిపోలేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మద్యం వినియోగ ధోరణులు మారుతున్నాయి. ఢిల్లీలో మద్యం సేవించే పురుషుల సంఖ్య 24.7% నుంచి 27.9%కి పెరిగింది. ఢిల్లీలో మహిళల్లో మద్యం సేవించే అలవాటు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది, ఇది ఆందోళన కలిగించే విషయం. అరుణాచల్ ప్రదేశ్‌లో సంప్రదాయకంగా మహిళల్లో మద్యం వినియోగం ఎక్కువగా ఉండేది, కానీ ప్రస్తుతం అక్కడ మహిళా వినియోగం తగ్గుముఖం పట్టింది.

మద్యం వినియోగంలో ఆరోగ్యపరమైన అంశాన్ని విస్మరించడానికి వీలు లేదు. భారతదేశంలో మద్యం సేవించేవారిలో దాదాపు 30% మంది నాటుసారా సేవిస్తున్నారు. వీరు తరచుగా ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందినవారు కావడం వల్ల క్వాలిటీ లేని మద్యం సేవించి తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ప్రకారం.. భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు మద్యం వ్యసనంతో బాధపడుతున్నారు, వారికి వైద్య సహాయం అవసరం. జాతీయ స్థాయిలో వినియోగం తగ్గినట్లు (29.2% నుంచి 22.4%కి) కనిపించినా, యువత, ఉద్యోగులలో పెరుగుతున్న వ్యసనం ఒక తీవ్రమైన సామాజిక సవాలుగా నిలుస్తోంది.

Tags:    

Similar News