INDIA WAR: పాకిస్తాన్‌పై "ఫైనాన్షియల్ స్ట్రైక్స్"
పాక్‌కు గుణపాఠం చెప్పేలా భారత్ వ్యూహాలు... పాక్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యం;
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి ఘటన భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పేలా భారత్ ప్లాన్ చేస్తోంది. ఉగ్రవాదులు, వారి వెనక ఉన్నవారు, మద్దతుదారులను భారత్ విడిచిపెట్టదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్ దౌత్యపరమైన చర్యలను మొదలుపెట్టింది. 'సింధు జలాల ఒప్పందం' రద్దు చేయడంతో పాటు పాకిస్తానీలకు వీసాలను రద్దు చేయడం, భారత గగనతలాన్ని పాక్ ఎయిర్‌లైనర్లకు మూసేసింది. తాజాగా దాయాది ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు రెండు ఫైనాన్షియల్ స్ట్రైక్స్‌కు ప్రణాళికలు రచిస్తోంది.
పాక్‌పై రెండు ఆర్థిక దాడులు
మొదటి చర్యగా పాకిస్తాన్‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) ‘గ్రే లిస్ట్’లోకి తిరిగి చేర్చేందుకు భారత్ ప్రయత్నించే అవకాశం ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయాన్ని అరికట్టడంలో విఫలమయ్యే దేశాలను ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో చేరుస్తుంది. గతంలో ఈ జాబితాలో ఉన్న పాకిస్తాన్‌ను తిరిగి అందులోకి చేర్చడం ద్వారా ఉగ్రవాదానికి నిధులు అందకుండా అంతర్జాతీయంగా ఆ దేశంపై ఒత్తిడి పెంచాలని భారత్ భావిస్తోంది. రెండో చర్యగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇటీవల పాకిస్థాన్‌కు మంజూరు చేసిన 7 బిలియన్ డాలర్ల భారీ ఆర్థిక సాయ ప్యాకేజీ వినియోగంపై భారత్ తన ఆందోళనలను వ్యక్తం చేయనున్నట్టు సమాచారం. ఇవే జరిగితే ఇప్పటికే ఆర్థికంగా చతికిలపడిన పాక్‌కు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది.
2018లో 'గ్రే లిస్ట్'లోకి పాకిస్తాన్
జూన్ 2018లో పాకిస్తాన్‌ని గ్లోబల్ మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్‌డాగ్ 'గ్రే లిస్ట్'లో ఉంచింది. ఉగ్రవాద నిధుల్ని అరకట్టడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించిన తర్వాత పాకిస్తాన్‌ని అక్టోబర్ 2022లో జాబితా నుంచి తొలగించింది. బయటకు చూపించడానికి పాకిస్తాన్ తీవ్రవాద గ్రూపులతో సంబంధం ఉన్న వ్యక్తులకు జైలు శిక్ష, జరిమానా,ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది. ఒక వేళ FATF గ్రే లిస్ట్ హోదాను పునరుద్ధరిస్తే పాకిస్తాన్ ఆర్థికంగా మరింత దివాళా తీస్తుంది. దేశంలోకి విదేశీ పెట్టుబడులు, మూలధన ప్రవాహం తగ్గుతుంది. తదుపరి FATF ప్లీనరీ సమావేశాలకు ముందే భారత్ ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టాలని అనుకుంటోంది.