China Mobiles Ban : త్వరలో చైనా మొబైల్స్‌ బ్యాన్.. కారణం అదే...

China Mobiles Ban : చైనా మొబైల్స్‌ కంపెనీలు భారత్‌లో భారీగా విక్రయాలు చేస్తూ ఇక్కడ టాక్స్‌ ఎగ్గొడుతూ ఉన్నాయి

Update: 2022-08-09 03:30 GMT

China Mobiles Ban : భారత స్మార్ట్‌ ఫోన్ల మార్కెట్‌లో అత్యధిక వాటా చైనా మొబైల్స్‌దే. చైనా మొబైల్స్‌ కంపెనీలు భారత్‌లో భారీగా విక్రయాలు చేస్తూ ఇక్కడ టాక్స్‌ ఎగ్గొడుతూ చైనాకు భారీగా సొమ్ము తరలిస్తున్నాయని ఎప్పటినుంచే ఆరోపణలు ఉన్నాయి. దీంతో చైనా మొబైల్స్‌ ను నియత్రించడంపై కేంద్రంచూపు సారించింది. రెండేళ్ల కిందట చైనాకు చెందిన యాప్స్‌పై వేటు వేసిన కేంద్రం.. మరో ఝలక్‌కు సిద్ధమవుతోంది.

భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో చైనా కంపెనీల దూకుడుకు బ్రేక్‌ వేసేందుకు ప్లాన్‌ చేస్తోంది. ఇందులో భాగంగా 12వేలలోపు ధర కల్గిన మొబైళ్లను విక్రయించకుండా నిషేధం విధించాలని యోచిస్తోంది. దేశీయ మొబైల్‌ కంపెనీలకు ఊతమిచ్చేందుకు గానూ ఈ నిర్ణయం తీసుకునే దిశగా సర్కారు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఆర్థిక అవకతవకల ఆరోపణలపై షావోమి, ఒప్పో, వివో వంటి చైనా కంపెనీలపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరోవైపు గల్వాన్‌ ఘర్షణల నేపథ్యంలో సుమారు 300 చైనా యాప్స్‌ను భారత్‌ రెండేళ్ల కింద టే బ్యాన్‌ చేసింది. భద్రతను కారణంగా చూపుతూ ఆ దేశానికి చెందిన జడ్‌టీఈ, హువావే కంపెనీల టెలికాం పరికరాలపైనా భారత్‌ ఆంక్షలు విధించింది. తాజాగా చైనా మొబైల్స్‌ కంపెనీలపై ద్రుష్టి సారించింది.

చైనా మొబైల్స్‌ ఎంట్రీకి ముందు భారత్‌లో దేశీయ స్మార్ట్‌ఫోన్ల కంపెనీలదే హవా. లావా, మైక్రోమ్యాక్స్‌ కంపెనీల ఫోన్లే ఎక్కువగా కనిపించేవి. చైనా మొబైల్‌ తయారీ కంపెనీల ప్రవేశంతో ఇవి కనుమరుగయ్యాయి. ప్రధానంగా షావోమి, రియల్‌మీ, ఒప్పో, వివో కంపెనీలు భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌పై గట్టి పట్టు సాధించాయి. బడ్జెట్‌ ఫోన్‌ విక్రయాల్లో వీటిదే హవా. 12వేల లోపు ధరలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో చైనా కంపెనీల వాటానే 80 శాతం వరకు ఉంటోంది.

చైనా మొబైల్స్‌ కంపెనీల ఆధిక్యానికి చెక్‌ పెట్టేందుకు మోదీ సర్కారు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటే షావోమి, రియల్‌మీ వంటి కంపెనీలకు గట్టిదెబ్బే. కేంద్ర నిర్ణయం వల్ల యాపిల్‌, శాంసంగ్‌ వంటి కంపెనీల ఫోన్లకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. అదే సమయంలో దేశీయ కంపెనీలకు పునరుజ్జీవం పోసినట్లు అవుతుంది.

Tags:    

Similar News