Indian Rupee : రోజుల్లో 113 పైసలు పెరిగిన విలువ.. కరెన్సీ మార్కెట్‌లో రూపాయి దూకుడు.
Indian Rupee : కరెన్సీ మార్కెట్‌లో భారత రూపాయి వరుసగా రెండో రోజు కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ముఖ్యంగా కేవలం రెండు రోజుల్లోనే అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా 113 పైసలు పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం, విదేశీ పెట్టుబడిదారుల నుంచి పెట్టుబడుల ప్రవాహం పెరగడం రూపాయికి ప్రధానంగా బలం చేకూరుస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వడ్డీ రేట్లలో కోతలు ఉండవచ్చనే అంచనాలు, దేశీయ స్టాక్ మార్కెట్లలో పెరుగుదల, చమురు ధరల తగ్గింపు వంటి అంశాలు కూడా రూపాయికి మద్దతు ఇస్తున్నాయి.
గురువారం రోజున ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి, అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 40 పైసలు పెరిగి రూ.87.68 వద్దకు చేరుకుంది. ఆర్బీఐ జోక్యం, డాలర్ ఇండెక్స్ బలహీనపడటం దీనికి ప్రధాన కారణాలు. సానుకూల దేశీయ షేర్ మార్కెట్, తక్కువ ముడి చమురు ధరలు, విదేశీ మూలధన ప్రవాహం వంటి ఇతర అంశాలు కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను పెంచాయి. అంతకుముందు, బుధవారం నాడు రూపాయి ఏకంగా 73 పైసలు పెరిగి రూ.88.08 వద్ద స్థిరపడింది. ఇది దాదాపు నాలుగు నెలల్లో రూపాయి సాధించిన అతిపెద్ద ఇంట్రాడే వృద్ధి కావడం విశేషం.
బుధవారం రూపాయి పెరగడానికి ప్రధానంగా ప్రపంచవ్యాప్త రిస్క్ సెంటిమెంట్‌లో తగ్గుదల, భారత్-అమెరికా వాణిజ్య చర్చలపై ఆశావహ దృక్పథం, ఆర్బీఐ జోక్యం కారణమని నిపుణులు తెలిపారు. మార్కెట్ గణాంకాలు కూడా రూపాయికి మద్దతు ఇస్తున్నాయి. ఆరు ప్రధాన కరెన్సీల ముందు డాలర్ బలాన్ని తెలిపే డాలర్ ఇండెక్స్ 0.28 శాతం తగ్గి 98.51 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 0.74 శాతం పెరిగినప్పటికీ, ప్రస్తుత 62.37 డాలర్ల స్థాయి రూపాయికి చాలా మంచిది. దేశీయ స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ 407.67 పాయింట్లు పెరిగి 83,013.10 కి, నిఫ్టీ 104 పాయింట్లు పెరిగి 25,427.55 కి చేరుకుంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు బుధవారం రూ.68.64 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. గత వారంలో 5 రోజుల్లో సుమారు రూ.30 వేల కోట్ల విదేశీ పెట్టుబడి పెట్టడం రూపాయికి బలాన్ని అందించింది.