Data Center : డిజిటల్ ఇండియాకు కొత్త ఊపిరి..డేటా సెంటర్ హబ్‌గా భారత్..బడ్జెట్ 2026పైనే ఆశలు

Update: 2026-01-26 14:00 GMT

Data Center : ప్రస్తుతం ప్రపంచం మొత్తం డిజిటల్ మయం అవుతోంది. మనం వాడే యూపీఐ పేమెంట్లు, చూసే వీడియో స్ట్రీమింగ్, వాడుతున్న ఏఐ చాట్‌బాట్‌లు.. వీటన్నిటికీ వెన్నెముక డేటా సెంటర్లు. భారతదేశం అతి త్వరలో ప్రపంచానికే ఒక భారీ సస్టైనబుల్ డేటా సెంటర్ హబ్గా మారబోతోంది. 2035 నాటికి ఈ రంగంలోకి సుమారు 70 బిలియన్ డాలర్ల (సుమారు రూ.5.8 లక్షల కోట్లు) పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రముఖ సంస్థ పీడబ్ల్యూసీ నివేదిక వెల్లడించింది. అయితే ఈ అభివృద్ధి పర్యావరణానికి ముప్పు కాకుండా ఉండాలంటే ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం.

భారతదేశంలో డేటా సెంటర్ల సామర్థ్యం 2035 నాటికి 14 గిగావాట్లకు చేరుకోవచ్చని అంచనా. ప్రస్తుతం మనం వాడుతున్న డేటాలో 15-20 శాతం మాత్రమే ఏఐ కోసం వాడుతుండగా, 2030 నాటికి ఇది 50 శాతానికి చేరుకోవచ్చు. దీనివల్ల సర్వర్ల నుంచి వెలువడే వేడిని తగ్గించడానికి భారీగా విద్యుత్ మరియు నీటి అవసరం పడుతుంది. ఉదాహరణకు ఒక 1 మెగావాట్ డేటా సెంటర్ కేవలం కూలింగ్ కోసం ప్రతిరోజూ సుమారు 68,500 లీటర్ల నీటిని ఖర్చు చేస్తుంది. ముంబై, చెన్నై వంటి నగరాల్లో ఇప్పటికే నీటి కొరత ఉంది కాబట్టి, ప్రభుత్వం గ్రీన్ టెక్నాలజీని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.

ఈ రంగంలోని నిపుణులు బడ్జెట్ 2026 నుంచి కొన్ని కీలక రాయితీలను కోరుతున్నారు. డేటా సెంటర్లకు క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హోదా కల్పించాలని, తద్వారా తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. అలాగే సోలార్, విండ్ వంటి పునరుత్పాదక ఇంధనాన్ని వాడే కంపెనీలకు అదనపు ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రీన్ డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన పరికరాల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల విదేశీ కంపెనీలు భారత్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

భారతదేశం ప్రస్తుతం ఈ రంగంలో ఎదుగుతున్న దశలోనే ఉంది కాబట్టి, మొదటి నుంచే పర్యావరణానికి హాని చేయని విధంగా డేటా సెంటర్లను నిర్మించడం చాలా సులభం. ఒకసారి నిర్మించిన తర్వాత మార్పులు చేయాలంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది. అందుకే ప్రభుత్వం నేషనల్ లెవల్లో ఒక బలమైన పాలసీని తీసుకురావాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో డేటా సెంటర్ల కోసం ప్రత్యేక నిధులు లేదా రాయితీలు ప్రకటిస్తారేమో అని ఐటీ రంగం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మన దేశం కేవలం డిజిటల్ హబ్ మాత్రమే కాదు, గ్రీన్ డిజిటల్ హబ్‎గా మారాలని అంతా ఆశిస్తున్నారు.

Tags:    

Similar News